పౌరసత్వ సవరణ బిల్లుపై రాజుకున్న ఆందోళనల మంటలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, కేంద్రం వీటిని మరింత ఎగదోస్తున్నాయి కానీ.. చల్లబరిచేందుకు అడుగులు వేయడం లేదు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్యంలో మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఢిల్లీ నుంచి యావత్ దేశానికి విస్తరిస్తున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోం,త్రిపురా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా అట్టుడుకుతోంది. చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు భగ్గుమంటున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది.
ఆందోళనలు హోరెత్తుతున్న సమయంలో విపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఏకంగా రోడ్డు మీదికి వస్తున్నాయి. ముగ్గురు సీఎంలు అసలు ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. చట్టసభల్లో బిల్లును అడ్డుకోవడం విపక్షాలు చేతులు ఎత్తేశాయి.కానీ ఇప్పుడు ఆందోళనలు హోరెత్తుతుండటంతో.. దానిని రాజకీయంగా వాడుకునేందుకు రంగంలోకి దిగాయి. మమత నేరుగా ధర్నా చేస్తే.. కాంగ్రెస్ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. మతం పేరుతో మరోసారి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు అంటూ మండిపడుతున్నారు. ఇలా విపక్షం రాజకీయాన్ని రగిలిస్తున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేది లేదంటోంది.
పైగా ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. విద్యార్థుల పేరుతో జిహాదిస్ట్లు, వేర్పాటువాదులు, మావోయిస్ట్‌లు చలామణీ అవుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించి… మరింత ఆజ్యం పోశారు. పౌరసత్వ సవరణ చట్టంతో సమాజంలో విభజన ఏర్పడుతుందని బీజేపీ కూడా అదే కోరుకుంటోందని చెబుతున్నారు. అటు బీజేపీ మెజార్టీ వర్గాల మద్దతు కోసం.. మైనార్టీ వర్గంపై.. ఇటు కాంగ్రెస్ మైనార్టీ వర్గాల మద్దతు కోసం.. వారి ఆందోళనకు మద్దతు పలుకుతున్నాయి. కానీ దేశం గురించి మాత్రం ఈ రెండు పార్టీలు ఆలోచించడం లేదు.