ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్…ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన విషయం రుజువైంది. అత్యాచారం విషయాన్ని బయటకు చెప్పినందుకు.. న్యాయం కోసం పోరాడినందుకు ఆమె తండ్రిపై దొంగ కేసు పెట్టించి.. పోలీసు కస్టడీలోనే చనిపోయేలా చేశారు. ఆమె ఓ సారి కోర్టుకు వెళ్లి వస్తూంటే.. యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించారు. ఇంత ఘోరమైన నేరాలు… నేర మనస్థత్వం ఉన్న రాజకీయ నేతలు .. సినిమాల్లోనే కనిపిస్తూంటారు. అత్యాచారం కకేసు రుజువయింది. మిగిలిన నేరాలూ రుజువయ్యే అంకాశం ఉంది. అందుకే.. ఇప్పుడు.. ఆ ఎమ్మెల్యేకు విధించే శిక్షపైనే.. దేశవ్యాప్త చర్చ ప్రారంభమయింది.
దిశ హత్యాచార ఘటనలో నిందితులకు తక్షణం ఉరి తీయాలంటూ వచ్చిన డిమాండ్ల వెనుక ఆక్రోశానికి..కారణం న్యాయం ఆలస్యం అవడమే. ఆలస్యం అయితే.. ఆ నిందితులు తప్పించుకుంటారు. మృగత్వానికి ఓ యువతి బలైపోతే.. ఆ మృగాళ్లు హాయిగా జైల్లో… కడుపు నిండా తింటూ…సుఖంగా బతికేస్తూంటారు. విచారణ ఎప్పుడు జరుగుతుందో..తెలియదు. ఎప్పుడు శిక్షపడుతుందో అస్సలు తెలియదు. అదే నిందితులు కాస్త పలుకుబడి కలిగిన వాళ్లయితే.. చనిపోయిన తర్వాత కూడా.. బాధితులకు న్యాయం దక్కదు. అందుకే దిశ హంతకుల ఎన్కౌంటర్ తర్వాత.. అంతకు ముందు.. ఆ తర్వాత జరిగిన జరిగిన అత్యాచారాల కేసులు.. వాటికి సంబంధించిన విచారణలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
దిశ హత్య కేసు తర్వాత … దేశవ్యాప్తంగా ఇలాంటి అనుమానాలే అందరిలోనూ బలంగా నాటుకుపోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేపై శిక్ష విధించే సమయం వచ్చింది. ఇక్కడ.. ఆయనకు ఎలాంటి శిక్ష విధిస్తారన్నది.. చాలా మందికి వస్తున్న అనుమానం. దేశ ప్రజలు కోరుకుంటున్నట్లుగా.. సెంగార్‌కు శిక్ష విధిస్తే.. ప్రజల్లో కాస్త నమ్మకం పెరుగుతుంది. లేకపోతే.. చట్టం.. రాజకీయ నేతలు, పలుకుబడి ఉన్న వారికి ఒక రకంగా.. సామాన్యులకు మరో రకంగా ఉంటుందన్న అభిప్రాయం బలపడిపోతుంది. అదే జరిగితే..చాలా ప్రమాదకరం.
నిందితులకు భయం పుట్టేలా శిక్షలు ఉండాలని చట్టాలు తీసుకు వస్తారు. కానీ ఆ చట్టాలు భయం పుట్టకుండా… తమను తాము.. పలుకుబడితో … రక్షించుకునేవాళ్లు కూడా ఉంటే.. ఆ చట్టాలకు అర్థం ఉండదు. ఇప్పుడు.. సెంగార్‌కు వేసే శిక్ష .. అలాంటి పలుకుబడి ఉన్న వారికి కూడా.. భయం పుట్టేలా ఉండాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష.