సంఘాలు ఉండొద్దు… ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకైక లక్ష్యం ఇదే అన్నట్టుగా ఉంది. నిజానికి, ఉద్యమ సమయంలో ఏ సంఘాలైతే కేసీఆర్ వెంట మద్దతుగా నడిచాయో, ఇప్పుడు ఆ సంఘాలను సమూలంగా లేకుండా చెయ్యాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాయి. తాజాగా సింగరేణి కార్మిక సంఘాలకు సంబంధించిన ఓ చర్చ అధికార పార్టీ వర్గాల్లో మొదలైంది. సింగరేణి కార్మిక సంఘాలు తెలంగాణలో చాలా కీలకమైనవి. ఎన్నికల సమయంలో ఆయా సంఘాలకు వరాలు ప్రకటించి, వాటిని కాపాడుకునే బాధ్యత తమది అన్నట్టుగా తెరాస వ్యవహరించింది. కానీ, ఇప్పుడు అవే సంఘాల ఉనికిని నిర్వీర్యం చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉందా అన్నట్టుగా కనిపిస్తోంది.
త్వరలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే, ఇవి అనుకున్న సమయానికి జరుగుతాయా అంటే కొంత అనుమానమే వ్యక్తమౌతోంది. ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేసేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సంఘాల అంశంలో అనుసరించిన పద్ధతినే ఇక్కడా ప్రయోగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీ సంఘాలు సమ్మెకి దిగితే… ఆయా సంఘాల నుంచి కార్మికులను అత్యంత చాకచక్యంగా వేరు చేయడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించింది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలే… కార్మికులకు నష్టం చేశాయనే అభిప్రాయాన్ని కలిగించారు. అంతేకాదు, సమ్మె ముగిశాక, ఆర్టీసీ కార్మికులు కొంతమంది కార్మిక శాఖకు లేఖ రాశారు. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించొద్దు, మాకు ఇలానే బాగుందని లేఖలు రాస్తుంటే… ఎన్నికలు ఎలా నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు! దీంతోపాటు, మరో రెండేళ్ల వరకూ సంఘాల ఊసే ఎత్తొద్దు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారు కదా.
సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల ఆలస్యం చేయడం వెనక కూడా ఇలాంటి వ్యూహాన్నే తెర మీదికి తెస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతిమంగా రాష్ట్రంలో ఏ సంఘాలూ ఉండొద్దు అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. సంఘాల కంటే ప్రభుత్వమే కార్మికులు, ఉద్యోగులకు అండగా ఉంటుందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే, ఉప్యాధ్యాయ సంఘాలు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల మీద సీఎం గుస్సా అవుతున్నారు. అంతేకాదు, ప్రజా సంఘాల నుంచి ఎవరైనా నాయకులు సీఎంవోకి వెళ్లి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వొద్దనే మౌఖిక ఆదేశాలు కూడా అమల్లో ఉన్నాయట! ఎన్నికలు ఆలస్యం చేస్తే నాయకులుండరు, నాయకులు లేకపోతే సంఘాల మనుగడ ఉండదు… ఇదే వ్యూహంగా కనిపిస్తోంది.