మన దేశంలో బడి పిల్లలకు, చట్టసభల సభ్యులకు (ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు) పెద్దగా తేడా ఏమీలేదు. ఏ విషయంలో? అరుపులు అరవడంలో, విచక్షణరహితంగా గోల చేయడంలో. పిల్లలు టీచరు క్లాసు రూములో లేనప్పుడే సరదాగా, ఏమీ తెలియనితనంతో గోల చేస్తారు. కాని చట్టసభల్లో సభ్యులు స్పీకరు ముందే నానా గొడవ చేస్తారు. అరుపులు కేకలతో హోరెత్తిస్తారు. అధికార ప్రతిపక్షాల సభ్యులు పరస్పరం తిట్టుకుంటారు. వెల్‌లోకి దూసుకెళ్లి రభస చేస్తారు. సభ జరగనివ్వకుండా, చర్చలు ముందుకు సాగకుండా అడ్డుకుంటారు. ఇలా వీరు చేసే అరాచకం అంతా ఇంతా కాదు.
ఎంత గోల చేసినా, సభ జరగనివ్వకుండా అడ్డుకున్నా, బూతులు తిట్టుకున్నా వీరికి రోజువారీ అలవెన్సులు ఆగవు. వీరి నెలవారీ జీతభత్యాలు ఆగవు. వీరు పొందే వివిధ రాయితీలకు ఢోకా ఉండదు. సభకు వచ్చి గోల చేసేవారికి అలవెన్సు తీసుకునే హక్కు ఉంటుందా? సభా సమయం, ప్రజాధనం వృథాచేసేవారికి అలవెన్సు చెల్లించవచ్చా? నిజానికి చెల్లించకూడదు. కాని ఎందుకు చెల్లిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం లేదు. సభలో గోలచేసి, సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డుకునే ఎమ్మెల్యేలకు (ఏ పార్టీవారైనా సరే) అలవెన్సు చెల్లించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదించింది. ‘నో వర్క్-నో అలవెన్స్’ అనే ఈ ప్రతిపాదన అమలుచేస్తే పనిచేయని (గోల చేసేవారికి) ఎమ్మెల్యేలకు అలవెన్సు అందదు.
నో వర్క్-నో అలవెన్స్ ప్రతిపాదన స్పీకర్ దగ్గర పెండింగులో ఉందని, దానిపైన ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ చెప్పారు. ‘సభలో అరిచి గోలచేసి, కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి ఇది చాలా అవసరం. స్పీకరుకూ ఆ విషయం బాగా తెలుసు. ఆయన దీన్ని అమలు చేస్తారనే నమ్మకం ఉంది’ అని మంత్రి అన్నారు. సభ్యులు గొడవ చేయడంవల్ల సభను షెడ్యూలు టైమ్ కంటే ముందుగానే ముగించాల్సివస్తోందన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ (బీజేపీ) ఉన్నప్పుడు నో వర్క్-నో అలవెన్స్ ప్రతిపాదన చేశారు. కాని అమలు కాలేదు.
అప్పట్లో దీన్ని బీజేపీ సభ్యులే వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం. ఇప్పుడూ దీన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ‘ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధి. అతను వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతాడు. ఈ ప్రతిపాదనతో ఆయన గొంతు నొక్కేయడమంటే ఆ నియోజకవర్గం ప్రజల గొంతు కూడా నొక్కేయడమే అవుతుంది’ అని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సారంగ్ అన్నారు. దీన్ని అంగీకరించమన్నారు. మరి నో వర్క్-నో అలవెన్స్ అమలు చేయగలరా?