ముందొచ్చిన చెవులు కన్నా, వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటూ ఓ సామెత ఉంది. ముందున్న సొంత పార్టీ నేతల కన్నా, వెనక నుంచి వచ్చి చేరిన ఫిరాయింపు నేతలకే అధిక ప్రాధాన్యత అన్నట్టుగా దీన్ని తెరాసలో కొందరి పరిస్థితికి అన్వయించుకోవచ్చు! సాధారణంగా.. ఒక పార్టీ తరఫున పోటీ చేసిన ఓ నాయకుడు, ఎన్నికల్లో ఓడిపోయాడే అనుకుందాం. ఓడిపోయాడు కదా అని ఆ తరువాత ఖాళీగా కూర్చోలేరు కదా! మరో ఐదేళ్ల విజన్ తో ప్రజల్లోకి వెళ్లాలి, పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలి, ఉన్న కేడర్ ని సమన్వయం చేసుకుంటూ రావాలి. ఇదే తరహాలో, గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొంతమంది తెరాస నేతలు వ్యవహరిస్తే… అలా ఎలా చేస్తారు, చెయ్యడానికి వీల్లేదని పార్టీ అధినాయకత్వమే క్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలానే కొంతమంది నేతలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నారని సమాచారం.
గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్లు, తెరాస ముఖ్య నేతలు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, చాలా నియోజక వర్గాల్లో జరిగింది ఏంటంటే… తెరాస అభ్యర్థులపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయారు. చేరినప్పుడు బాగానే ఉంటుందిగానీ, ఆ తరువాతే… క్షేత్రస్థాయిలో ఒకే పార్టీలో రెండు వర్గాలు తయారౌతాయి. తెరాసలో అలాంటి కుంపట్లు చాలానే రాజుకున్నాయి, ఈ మధ్య ఒక్కోటిగా బయటకి వస్తున్న పరిస్థితీ చూస్తున్నాం. కొల్లాపూర్, నకిరేకల్, తాండూర్, పాలేరు, పినపాక, వైరా, మహేశ్వరం, ఇల్లెందు, ఎల్బీనగర్, ఎల్లారెడ్డి.. ఈ నియోజక వర్గాల్లో ఓడిన నేతలకు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని సమాచారం. గ్రూపులుగట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓడిన నేతలు యాక్టివ్ గా పనిచేస్తుండటాన్ని… గెలిచిన ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. ఇదే అంశమ్మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి తాజాగా వరుస ఫిర్యాదులు అందాయని సమాచారం. హోదా లేని నాయకులు జనాల్లో తిరుగుతుంటే, ఎమ్మెల్యేలుగా తమ పరిస్థితి ఏంటనేది వారి వాదన.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కొంతమంది నాయకుల్ని కేటీఆర్ స్వయంగా పిలిపించినట్టు సమాచారం. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశాలు పెట్టాలనీ, ఓడినవారు స్పెషల్ మీటింగులు పెట్టకూడదని కేటీఆర్ క్లాస్ తీసుకున్నారట. ఓడిన నేతలు పర్యటనలు చెయ్యొద్దనీ, అలా చేస్తే పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడి ఇబ్బందులొస్తాయని నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. మాజీలూ సీనియర్లు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు పెట్టొద్దని కేటీఆర్ ఆదేశించారని తెరాస వర్గాలు ద్వారా తెలిసింది. వాస్తవానికి, ఈ పరిస్థితికి కారణం ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే. ఇది పార్టీ అధినాయకత్వం స్వయంకృతమే. ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకుని ఉండటమే మేం చేసిన తప్పా అన్నట్టుగా ఓడిన నాయకులు బాధపడుతున్న పరిస్థితి. పార్టీకి ఇప్పుడు ఫిరాయింపు నేతలే ఎక్కువయ్యారు! వాళ్లని అనుసరించాలని సొంత పార్టీ వాళ్లకి చెబితే, వాళ్లెలా స్పందిస్తారు..? గ్రూపులు ఏర్పడకుండా ఉండే పరిస్థితి ఎక్కడుంది..? వెనకొచ్చిన కొమ్ములే వాడిగా కనిపిస్తున్నాయి.