రాష్ట్రంలో పార్టీని ఎలా మళ్లీ గాడిలో పెట్టాలో టి. కాంగ్రెస్ నేతలకు ఇంకా అర్థం కావడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ఎలా వ్యవహరించాలీ, ఏ కార్యక్రమాలు చేపట్టాలనే గందరగోళంలోనే ఉంటోంది. ఏ అంశాన్ని తీసుకుని కేసీఆర్ సర్కారుని నిలదియ్యాలి, ప్రజల్లోకి వెళ్లాలనే స్పష్టత కనిపించడం లేదు. ఆర్టీసీ కార్మికుల తరఫున సమ్మె సమయంలో పోరాడాలనుకుంటే… యూటర్న్ తీసుకుని సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. దిశ ఘటన అనంతరం మహిళా సమస్యలపై పోరాడాలనుకుంటే… మద్య నిషేధ ఉద్యమం అంటూ భాజపా హడావుడి ఎక్కువైపోయింది. ఇలా సరైన అంశాన్ని ఎంపిక చేసుకోలేక, కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ విఫలమౌతూనే ఉంది. అయితే, ఇప్పుడు రాష్ట్రస్థాయిలో మరో పెద్ద పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు! దాని పేరు… తెలంగాణ బచావో.
గతవారంలో మోడీ సర్కారును ప్రశ్నించేందుకు ఢిల్లీలో భారత్ బచావో పేరుతో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు కదా! అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణలో ఈ బచావో పేరుతో కేసీఆర్ వైఫల్యాలను ఎండగడతారట. అంశాలవారీగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో మరికొన్ని కార్యక్రమాలు ఉండేట్టు ప్రణాళిక సిద్ధం చేస్తారట. నిరుద్యోగ భృతి, పెన్షన్ వయసు పెంపు, లిక్కర్ ధరల పెంపు, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు… ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో తరహాలో ప్రస్థావిస్తూ సీఎం కేసీఆర్ పాలనపై ఉద్యమించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమౌతున్నారు.
రెండో టెర్మ్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా… పాలనపై తెరాసలో ఎలాంటి విశ్లేషణగానీ, గతంలో మాదిరిగా వార్షికోత్సవాలుగానీ నిర్వహించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అంశాలవారీగా కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లేందుకు ఇది కాంగ్రెస్ కి కలిసొచ్చే సమయమే. అయితే, దీన్ని ఎంత సమర్థంగా కాంగ్రెస్ వినియోగించుకుంటుందీ అనేదే ప్రశ్న? తెలంగాణ బచావో పేరుతో ఆందోళనలు అంటున్నారుగానీ… వీటికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నదే మళ్లీ ఇక్కడ ప్రశ్న? తెలంగాణ బచావో కార్యక్రమాలు చేపడతా అంటూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కోర్ కమిటీలో చర్చించడానికి ముందే ఆయన లీడ్ తీసేసుకుంటే ఎలా అనే గుసగుసలూ అక్కడ వినిపించాయి! ఇక, ఇవాళ్టి కోర్ కమిటీలో చర్చించి షెడ్యూల్ ప్రటిస్తామని అంటున్నారు, మంచిదే. కానీ, దాని కంటే ముందుగా చర్చించి నిర్ణయించాల్సింది నాయకుల మధ్య ఐక్యత అంశం. ప్రతీసారీ పార్టీ కార్యక్రమాలకు గండికొడుతున్నది ఇదే. త్వరలో మున్సిపల్ ఎన్నికలున్నాయి. సరిగ్గా ప్లాన్ చేయగలిగితే కాంగ్రెస్ కి తెలంగాణ బచావో ఆందోళనలు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.