ఇంగ్లిష్ మీడియం బిల్లు.. చట్టంగా మారలేదు. ముందుగా… ఏ బిల్లు అయినా చట్టంగా మారాలంటే..గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. అలా గవర్నర్ వద్దకు వెళ్లాలంటే.. ముందుగా.. ఉభయసభల ఆమోదం పొందాలి. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా అన్ని బిల్లులనూ ఉభయసభల్లో ఆమోదింప చేసుకున్నారు కానీ.. ఇంగ్లిష్ మీడియం బిల్లును మాత్రం శాసనమండలిలో ఆమోదింపచేసుకోలేకపోయారు. దానికి కారణం.. శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ ఉంది. అన్ని బిల్లులను టీడీపీ సమర్థించింది కాబట్టి.. మండలిలోనూ పాస్ అయిపోయాయి. కానీ.. ఇంగ్లిష్ మీడియం బిల్లులో మాత్రం.. టీడీపీ సవరణలు కోరింది.
బిల్లులో ఏపీ మొత్తం వచ్చే విద్యాసంవత్సరం నుంచి.. ఇంగ్లిష్ మీడియం ఉంటుందని ప్రతిపాదించారు. విద్యార్థులందరూ.. ఒక్క ఇంగ్లిష్ మీడియమే చదవాలని నిర్దేశించారు. ఇక్కడే టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. బిల్లును సమర్థిస్తాం కానీ.. ఒక్క మార్పు చేయాలని సూచించారు. ఓన్లీ ఇంగ్లిష్ మీడియం అని ఉన్న చోట.. ఇంగ్లిష్ లేదా తెలుగు అనే పదం మార్చాలని కోరారు. దానికి వైసీపీ నేతలు అంగీకరించలేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. ఈ విషయంపై యనమలతో చర్చలు జరిపినా.. టీడీపీ వెనక్కి తగ్గలేదు. టీడీపీ చెప్పినట్లు బిల్లును మారిస్తే.. తమ ఉద్దేశం పూర్తిగా దెబ్బతింటుందని.. అలా చేయడం కుదరదని బుగ్గన తేల్చి చెప్పారు. ఫలితంగా బిల్లు పెండింగ్లో పడిపోయింది.
మళ్లీ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే.. ఆ బిల్లును ప్రవేశ పెట్టడానికి అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంను నిర్బంధంగా అమలు చేయాలంటే.. కచ్చితంగా ఆ బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే.. టీడీపీ సహకరించాలి. అందుకే.. ఇప్పుడు.. ఇంగ్లిష్ మీడియం అమలు సాధ్యమవుతుందా.. లేదా అన్న చర్చ ప్రారంభమయింది.