పౌరసత్వ సవరణ చట్టంపై ఇప్పటికే దేశం మండిపోతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ వివాదంపై సినీ సెలబ్రిటీలు చేస్తున్న ట్వీట్లు.. కొత్త పోరాటానికి దారి తీసోతంది. మోడీ నిర్ణయాలను సమర్ధించే అక్షయ్‌కుమార్.. జామియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ఉన్న ట్వీట్‌ను లైక్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో వెంటనే స్పందించిన అక్కీ… ఆ లైక్‌ను పొరపాటును చేశానంటూ మళ్లీ ట్వీట్ వేయడంతో వివాదం మరింత ముదిరింది. కొందరైతే అక్షయ్‌ను బ్యాన్ చేయాలంటూ ట్రోల్ చేశారు. మాటల దాడికి దిగారు. నెటిజన్ల నుంచే కాదు.. తోటి నటుల నుంచి కూడా అక్షయ్‌కుమార్‌పై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే అనురాగ్ కశ్యప్ అక్కీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
ఓ హీరోను డైరెక్టర్ నేరుగా విమర్శించడంతో ఆసక్తికరంగా మారింది. అనురాగ్ కశ్యప్ మాత్రమే కాదు.. అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలు.. విద్యార్థులపై దాడికి నిరసనగా ట్వీట్ చేశారు. డైరెక్టర్ మహేశ్ భట్ కూడా అనురాగ్ కశ్యప్‌తో జత కలిశారు. పౌరసత్వ సవరణ చట్టం ఓ వర్గంపై వివక్ష చూపేలా ఉందని.. ఇది రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోందని అన్నారు. మహేశ్ భట్.. ఓ వైపు సీఏఏను వ్యతిరేకిస్తుంటే.. ఆయనపై విమర్శలకు దిగారు కంగనా సోదరి రంగోళీ. మహేశ్ భట్ వీడియోను పోస్ట్ చేసి.. చొరబాటుదారులకు ఎంతలా భయం పుడుతుందో చూడండంటూ ట్వీట్ చేశారు. గతంలోనూ కొందరు మేధావులు ప్రధానికి లేఖ రాసిన సమయంలోనూ ఇలాగే బాలీవుడ్ రెండుగా చీలింది. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.
మక్కల్ నీది మయ్యమ్.. అధినేత కమల్ హాసన్ పౌరసత్వ సవరణ చట్టంపై నిప్పులు చెరిగారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టను ఆశ్రయించినట్లు చెప్పారు. తమిళ నటుడు సిద్ధార్థ్ కూడా మోదీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డారు. వాళ్లిద్దరూ కృష్ణార్జునులు అనుకుంటున్నారని.. కానీ వాళ్లు శకుని, దుర్యోధనులు అంటూ విమర్శలు గుప్పించారు. యురి సినిమాలో హీరోగా నటించి మోదీ మన్నలను అందుకున్న విక్కీ కౌశల్ కూడా చట్టాన్ని తప్పుపడుతున్నారు.