నిత్యం ప్రజల్లో ఉండాలి, కేసీఆర్ సర్కారుపై ఏదో ఒక అంశం పేరుతో పోరాటం చేయాలనేది టి. భాజపా లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. అయితే, ఈ క్రమంలో రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులను కేవలం కేసీఆర్ మీద విమర్శలు చేసేందుకు అనువైన మార్గంలో ప్రెజెంట్ చేసే ప్రయత్నమే భాజపా తీరులో ఈ మధ్య కనిపిస్తోంది. ఇప్పటికే, మద్యపానం నిషేధించాలంటూ దిశ ఘటన నేపథ్యంలో భాజపా నేత డి.కె. అరుణ రెండ్రోజులపాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి ఉద్యమిస్తామంటున్నారు. భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్.. మూసీ నది ప్రక్షాళన ఉద్యమాన్ని గతవారం నుంచే ప్రారంభించారు. మూసీని బాగు చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తూ హైదరాబాద్లో మూసీ ఒడ్డున ఓ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు కొత్తగా మరో అంశాన్ని తెర మీదికి తెస్తూ.. ప్రజల్లోకి వెళ్తామంటున్నారు లక్ష్మణ్. అదేంటంటే… సిటిజెన్షిప్ ఎమండ్మెంట్ చట్టం.
ఈ చట్టం పేరుతో కాంగ్రెస్, తెరాస మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు లక్ష్మణ్. ఈ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటులో తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం సరికాదన్నారు. ముస్లింలకు సిటిజన్ షిఫ్ ఇవ్వడం లేదని తెరాస సభ్యులు ఎలా అంటారనీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఇవ్వాలన్నది తెరాస డిమాండులా ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చొరబాటుదార్లు ఉన్నారనీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారనే ఘటనలు వెలుగులోకి వస్తుండటం చూస్తున్నామన్నారు. ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను తెరాసలాంటి పార్టీలు చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు. అందుకే, ఈ సీఏఏ మీద ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు త్వరలో తాను ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా అన్నారు. ఈ నెలాఖరున అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
సీఏఏ చట్టం మీద దేశవ్యాప్తంగా కొన్ని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వాటిని నివృత్తి చెయ్యాల్సింది కేంద్రమే. ఇక, తెరాస విషయానికొస్తే.. ఇలాంటి అంశాలపై స్పందించలేని పరిస్థితిలో పడింది. మజ్లిస్ తో తెరాసకు దోస్తీ ఉంది. అయితే, ఆ పాయింట్ ని హైలైట్ చేయడానికి, దాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే దిశగానే టి. భాజపా ప్రయత్నిస్తోంది. ఈ చట్టంపై అనుమానాలు నివృత్తి చేసే కార్యక్రమాన్ని కూడా… తెరాస మీద విమర్శలకు మరో అవకాశంగా మార్చుకునే వ్యూహాత్మక ప్రయత్నమే టి. భాజపా తీరులో కనిపిస్తోంది. కేసీఆర్ పాలనలో వైఫల్యాలను ఎంచుకుని ఈ స్థాయిలో పోరాటం చేస్తే భాజపాకి ప్లస్ అవుతుంది. అవన్నీ వదిలేసి ఇలాంటి వాటివెంట భాజపా పడితే ఏం ప్రయోజనం..?