వివాదాస్పద మీడియా జీవో 2430 ను తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించేది… జీవో 2430 ఉందని.. వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ జరిపింది. జీవో వల్ల ఏ పత్రిక అయినా వార్త రాసినప్పుడు.. ఆధారాలున్నాయా.. లేవా అనేది చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ప్రెస్‌కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందనిఅభిప్రాయపడింది. ప్రభుత్వం తరుపున వాదనను.. ఐ అండ్ పీఆర్ అదనపు డైరెక్టర్ కిరణ్ వినిపించారు. జీవోను దుర్వినియోగం చేయబోమని చెప్పుకొచ్చారు.
అయితే ప్రభుత్వ వాదనతో ప్రెస్ కౌన్సిల్ సంతృప్తి చెందలేదు. జీవోను ఉపసంహరించుకోవాలని జస్టిస్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తెలుగు మీడియాలో కొన్ని చానళ్లు, పత్రికలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటున్న జగన్.. వాటిని కట్టడి చేయడానికి తన వంతు ప్రయత్నలు పదవి చేపట్టినప్పటి నుండి చేస్తున్నారు. మూడు చానళ్లను అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రసారం చేయకుండా బహిష్కరించారు. అదే సమయంలో.. కొన్ని పత్రికలకు ప్రకటనలు నిలిపివేశారు. చివరికి.. నిరాధార వార్తలు రాస్తే కేసులు వేస్తామంటూ.. జీవో తీసుకొచ్చారు.
దీనిపై.. దేశమంతా గగ్గోలు రేగింది. అయినప్పటికీ.. ప్రభుత్వం.. వెనుకడుగు వేయలేదు. అసెంబ్లీలో కూడా.. జీవోను జగన్ సమర్థించుకున్నారు. ఇలాంటి సమయంలో… ప్రెస్‌కౌన్సిల్.. ఆ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఒక వేళ ఈ ఆదేశాలను జగన్ పాటించకపోతే.. ప్రెస్‌కౌన్సిల్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. జగన్‌కు చెందిన మీడియా సంస్థలు కూడా.. ప్రెస్‌కౌన్సిల్‌లో మెంబర్లే. మీడియాకు సంబంధించి… ప్రెస్‌కౌన్సిల్‌కు విశేషాధికారాలు ఉన్నాయి.