ఏపీలో మూడు రాజధానుల అంశం చర్చనీయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పందించారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… పాదయాత్ర సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా హామీలు ఇచ్చారనీ, ముందుగా వాటి అమలుపై దృష్టిపెట్టాలన్నారు. మూడు రాజధానులు అంటున్నారనీ, వాటి నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. మనదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా, ఆయా రాష్ట్రాలకు రాజధాని ఒక్కోటి చొప్పున ఉంటుందనీ, జగన్ చేస్తున్నది కొత్త ఆలోచన అన్నారు.
కొత్త రాజధాని అనగానే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తారనీ, దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయనీ, వారి సొంత సామాజిక వర్గానికి చెందినవారికి మేలు చేయడమే ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు వీహెచ్. ఆంధ్రా రాజధానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారని జగన్ మరచిపోకూడదన్నారు. దీనిపై కేంద్రం స్పందించాలనీ, ఇలా మూడు రాజధానులు అంటే రుణాలు ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించాలన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ఈ నిర్ణయం మానుకోవాలని చెబితే తప్పకుండా ఆగుతుందని నమ్ముతున్నా అన్నారు. ప్రధాని జోక్యం చేసుకుంటే జగన్ మారతారన్నారు. మూడు రాజధానుల వల్ల ప్రజలకు నష్టమే అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలంటే వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప, ఇలా మూడు రాజధానులు అనడమేంటన్నారు. ఒక ముఖ్యమంత్రి అందరి గురించీ ఆలోచించాలనీ, నేనూ నా స్వార్థం అనేట్టుగా ఉండకూడదన్నారు. తిరుగులేని మెజారిటీని ఏపీ ప్రజలకు జగన్ ఇచ్చారనీ, దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని జగన్ కి వీహెచ్ సూచించారు.
వీహెచ్ చెప్పినట్టు కేంద్రం ఈ అంశంపై జోక్యం చేసుకుంటుందా, కేంద్రం చెబితే ఏపీ సర్కారు ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గుతుందా..? ఒకటైతే వాస్తవం… అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పాలన వికేంద్రీకరణ వేరు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాట్లు, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఉండాలి. అంతేగానీ, హైకోర్టు ఒక దగ్గర, అసెంబ్లీ మరో చోట, దానికి దూరంగా సచివాలయం… ఈ తరహా పరిస్థితి వికేంద్రీకరణ ఎలా అవుతుంది..? ఈ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఏమంటారో చూడాలి. ఏపీ సీఎం జగన్ ప్రతిపాదనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటారో చూడాలి? ఇంతవరకూ ఆయన స్పందించినట్టు లేదు!