పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ.. పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ.. బయట మాత్రం… ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతోంది. పది రాష్ట్రాలు… తాము అమలు చేయబోమని ప్రకటించాయి. ఆ చట్టం అమలులో… రాష్ట్రాలకు పాత్ర లేదని.. కేంద్రం వాదిస్తున్నప్పటికీ.. వారు పౌరసత్వం ఇవ్వాలనుకున్నారు.. ఉండేది ఆయా రాష్ట్రాల్లోనే. తాము గుర్తించబోమని ఆ రాష్ట్రాలు చెప్పిన తర్వాత కేంద్రం పౌరసత్వం ఇచ్చినా.. ఇవ్వకున్నా ఉపయోగం ఉండదు. పౌరసత్వ బిల్లుపై అసలు నిజాలేంటో చాలా మందికి అవగాహన లేదు. అందరూ పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఒక్క అంశమే.. అందరి మదిలోకి వెళ్లింది. అందుకే.. హిందువుల్లోనూ… దీనిపై భయాందోళనలు కనిపిస్తున్నాయి. అసలు ఇతర దేశాల వలస అనే మాటే పెద్దగా వినిపించని.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు మేము పౌరసత్వం నిరూపించుకోవడం ఏమిటి.. అన్న ప్రశ్న.. కింది స్థాయి వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ కారణంగానే… సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు కూడా రోడ్ల మీదకు వస్తున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రులు వ్యతిరేకించలేరు కానీ.. మిత్రపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొత్త చట్టాన్ని ఎన్డీఏలో కీలక పార్టీ అయిన బిహార్ సీఎం నితీష్‌కుమార్ వ్యతిరేకిస్తున్నారు. బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేయబోమని ప్రకటించారు. రాష్ట్రంలో మైనార్టీల భద్రతకు భరోసా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. బీజేపీని విబేధించే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఇప్పటికీ.. ఆ చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటించాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన చేస్తున్నారు. హిందూత్వంలో బీజేపీతో పోటీ పడే శివసేన.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమ వైఖరి ప్రకటిస్తామంటోంది.
సీఏఏ బిల్లును సమర్థించుకోవడానికి బీజేపీకి ఇప్పటికి చాన్స్ లేకుండా పోయింది. ఆ బిల్లుపై విస్తృత చర్చ చేపట్టి… దేశంలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత ముందడుగు వేయాల్సింది. కానీ.. కావాల్సింత మెజార్టీ ఉండి… ఓ వర్గానికి మాత్రమే నష్టం చేస్తున్నామనే భావన ప్రజల్లోకి కల్పించి.. తమ పని తాము చేసుకుపోయారు. ఇప్పుడదే.. మంటలకు కారణం అవుతోంది.