రాజ్‌భవన్ అమరావతిలో సీఎం ఆఫీస్ వైజాగ్‌లో…!
హెచ్వోడీలు అమరావతిలో సెక్రటేరియట్ వైజాగ్‌లో..!
హైకోర్టు కర్నూలులో బెంచ్‌లు అమరావతి, విశాఖల్లో..!
ఈ ఆలోచనలు పదో తరగతి కుర్రాడికైనా కామెడీగా ఉంటాయి. కానీ జగన్ నుంచి స్ఫూర్తి పొందిన… జీఎన్ రావు అనే నిపుణుల కమిటీ.. అచ్చంగా ఇవే సిఫార్సులు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి.. మరికొంత మంది నిపుణులు కలిసి.. ఏపీ సమగ్రాభివృద్ధిపై నివేదిక ఇచ్చారు. వారి దృష్టిలో సమగ్రాభివృద్ధి అంటే.. మూడు చోట్ల హైకోర్టు… రెండు చోట్ల అసెంబ్లీ … ఓ మూల సెక్రటేరియట్ .. మరో మూల శాఖాధిపతుల కార్యాలయాలు.. అలాగే సీఎం… అటు.. గవర్నర్ ఇటు. కాస్త ఆలోచన చేసినా..” అరే.. ఇలా.. ఎలా నివేదిక ఇస్తార్రా బాబు” అని… పదో తరగతి పిల్లలు కూడా అనుకునే పరిస్థితి. ఇంత అసంబద్ధమైన నివేదికను.. ఇప్పటి వరకూ దేశంలో ఏర్పాటైన ఏ కమిటీ కూడా ఇచ్చి ఉండదు.
కర్నూలుకు హైకోర్టు ఇచ్చి రెండు బెంచ్‌లు పెడితే ప్రయోజనం ఏమిటి..?
శ్రీభాగ్ ఒప్పందం పేరు చెప్పి.. కర్నూల్లో హైకోర్టు పెట్టడం సమంజసం అన్నారు జీఎన్ రావు కమిటీ సభ్యులు. అదే రిపోర్ట్‌లో.. అమరావతిలో ఒక బెంచ్.. విశాఖలో మరో బెంచ్ పెట్టాలని సిఫార్సు చేశారు. అంటే ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకి కర్నూలు వెళ్ళే అవసరం ఉండదు. కర్నూలు హైదరాబాద్ కు దగ్గర కాబట్టి లాయర్లు కూడా హైదరాబాద్ నుండే రాకపోకలు సాగించే వీలుంది. మొత్తానికి జడ్జీల క్వార్టర్స్ తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఒరిగేది ఏమీ లేదు. దీనితో రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదు. కర్నూలు హైకోర్టు.. జిల్లా కోర్టు కంటే.. కాస్త పెద్దదిగా ఉంటుంది. అంతంకు మించి వారికొచ్చే ప్రయజనం లేదు.
హవ్వ.. శాఖాధిపతులు అమరావతిలో.. సెక్రటేరియట్ విశాఖలోనా..?
జి ఎన్ రావు కమిటీ నివేదిక అత్యంత వివేకరహితమైన నివేదిక అని అంచనా వేసుకోవడానికి మరో కారణం.. అమరావతి, విశాఖల్లో పెట్టాలని సిఫార్సు చేసిన… విభాగాలు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విశాఖపట్నంలో, రాజ్ భవన్, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సిఫార్సు చేసింది. దీంతో పాటు శాఖాధిపతులు, మంత్రుల నివాసాలు అమరావతిలో ఏర్పాటు చేయాలని, అవి కూడా మంగళగిరి వైపుకు తీసుకురావాలని ఆదేశించారు. విశాఖపట్నంలో సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. సచివాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి.. శాఖాధిపతుల కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయటం ఏమిటో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి.. రాజ్ భవన్ ను అమరావతిలోనే ఉంచటం మరింత కామెడీగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా సమ్మర్ సెషన్ విశాఖపట్నంలో, వింటర్ సెషన్ అమరావతిలో నిర్వహించాలని జీఎన్ రావు కమిటీ సిఫార్సు చేసింది. అంటే.. శాసనసభను కూడా ఏడాదికి 10 రోజులపాటు పనిచేసేందుకు కమిటీ పరిమితం చేసింది.
ప్రజాధనం వృధాని అంచనా వేయలేని నిపుణలు..!
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. రాజధానిని మార్చాలంటే.. కొన్ని వేల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చెబుతున్న లెక్క ప్రకారం.. అమరావతిలో ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం మొత్తం అక్కడి నుంచే నడుస్తోంది. ఇప్పుడు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటే మళ్ళీ అంతకు మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిపుణులు పట్టించుకోలేదు. ఆ భవనాలు పూర్తి చేయాలని సూచించారు.. కానీ వాటిని ఏం చేయాలో మాత్రం చెప్పలేకపోయారు.
పాలన కలగాపులగం.. ప్రజలకు తిప్పలు తెచ్చే విధానాలు చెప్పిన కమిటీ..!
ప్రజలకి అందుబాటు ప్రకారం చూస్తే ఇప్పుడున్న అమరావతినే అందరికీ అందుబాటులోు ఉంటుంది. ఇటు వైజాగ్ నుంచి రావాల్సి వచ్చినా.. అటు చిత్తూరు నుంచి రావాల్సిన వచ్చినా.. సమానదూరం. ఇప్పుడు వైజాగ్ కు రాజధాని తరలిస్తే అది ఒక పక్కనుండి 10వ జిల్లా, మరోపక్క నుండి 3 వ జిల్లా అవుతుంది. అంటే ఇది కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మందికి దూరం అవుతుంది. రాయలసీమ వాసులకి అయితే ఏడు వందలకుపైగా కిలోమీటర్ల దూరం అయింది. హైకోర్టు దగ్గరకు వచ్చి..సెక్రటేరియట్ దూరం అయింది.
తుళ్లూరుకు వరద వచ్చిందెప్పుడు..? విశాఖకు తుపాను రానిదెప్పుడు..?
తుళ్లూరుకు వరద ముప్పు ఉందని కమిటీ చెప్పుకొచ్చింది. ఈ జీఎన్‌రావు కమిటీ ఈ వరద ముప్పు ఉందనే కారణాన్ని చెప్పడానికి ఎప్పుడెప్పుడు ఎలా వరదలు వచ్చాయో.. సహేతుకమైన కారణాల్ని చెప్పి ఉంటే.. బాగుండేది. కానీ అది కమిటీకి అవసరం లేదు. పాలకుల ఆలోచనలకు తగ్గట్లుగా నివేదిక ఇవ్వాల్సి అందుకే అలా ఇచ్చారు. గత రెండు దశాబ్దాలుగా వరద లేని, తుళ్ళూరు వరద ముప్పు ఉన్న ప్రాంతం కాబట్టి రాజధాని మంచిది కాదు అని చెప్పింది ఈ కమిటీ. అయితే.. ఏడాదికి కనీసం ఒక తుఫాను పలకరించే వైజాగ్ ని రాజధానిగా సూచించింది. ప్రభుత్వానికి వారు చెప్పినట్లు నివేదిక ఇచ్చి.. వారిచ్చే.. కొన్ని లక్షలో.. కొన్ని ప్రయోజనాలో పొందడమే ఈ నిపుణుల పని. దీని వల్ల జరిగే ఏపీ విధ్వంసంతో వారికి పని లేదు.