మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అతని సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలకు పోలీసులు, కేసులు, కోర్టులు, జైలు శిక్షలు, బెయిలు పొందడాలు కొత్త విషయాలేవీ కావు. ఎన్నికలయిన ప్రతీసారి వారిరువురూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం, అందుకు వారిపై కేసులు నమోదు అవడం, ఆ తరువాత కోర్టులు, బెయిలు వంటివన్నీ వారికి చాలా సర్వసాధారణమయిన విషయాలనే చెప్పవచ్చును.
ఇటీవల గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం కోసం హైదరాబాద్ పాతబస్తీలోకి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలి వచ్చినప్పుడు వారి వాహనంపై అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలోనే ఆయన అనుచరులు దాడి చేశారు. ఆ తరువాత షబ్బీర్ ఆలి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. తరువాత షరా మామూలుగానే ముందు చెప్పుకొన్నవన్నీ జరిగాయి.
ఈరోజు ఉదయం అసదుద్దీన్ ఒవైసీ దక్షిణ జోన్ డిసిపి కార్యాలయానికి వచ్చి పోలీసులకి లొంగిపోయారు. వైద్య పరీక్షల అనంతరం వారు ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో వెంటనే విడుదలయ్యారు. అందుకోసం ఆయన రూ. 10,000 పూచికత్తు చెల్లించారు.
ఒవైసీ సోదరులు ముస్లింల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ఎన్నికలు జరిగిన ప్రతీసారి ముస్లిం ప్రజలను ఆకర్షించేందుకు ఇటువంటి విద్వేషాలోచనాలు చేయవలసిన అవసరం ఉండేది కాదు. అలాగే ఈ కోర్టులు, కేసులు, జైలు, బెయిలు బాధలు కూడా ఉండేవి కావు. కానీ ముస్లిం ప్రజల సంక్షేమం కోసం ఏళ్ల తరబడి కష్టపడటం కంటే, ఎన్నికల సమయంలో కాస్త వారిని రెచ్చగొడితే ఒడ్డున పడిపోవచ్చని వారు భావిస్తున్నారేమో తెలియదు. ప్రజాప్రతినిధులుగా గౌరవనీయమయిన పదవులలో ఉన్నవారు నలుగురికీ ఆదర్శంగా, మార్గదర్శనం చేసే విధంగా వ్యావహరించాలని ప్రజలు ఆశిస్తారు. అదేమీ అత్యాశ కాదు కదా? మరి ఇంత చిన్న విషయాన్ని ఓవైసీలు ఎందుకు పట్టించుకోరో?