వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ మెగా స్టార్ చిరంజీవికి విపరీతంగా నచ్చింది. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత ఏపీకి ప్రత్యేకహోదా కోసం కూడా కనీస ప్రకటన చేయని చిరంజీవి… తొలిసారి జగన్ కు జేజేలు పలుకుతూ.. తొలి ప్రకటన చేశారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు. నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక.. అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని ప్రశంసించారు. గత అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే.. ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీలో మరో లక్ష కోట్లు అప్పు చేసి.. అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితిపై ఆందోళన నెలకొందన్నారు. వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు.. నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశఆరు. అయితే రాజధాని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని ఓ మాట జగన్‌కు సూచించారు. మరో వైపు ఆయన సోదరుడు.. జనసేన అధినేత వన్ కల్యాణ్… భిన్నంగా స్పందించారు. రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదిక తర్వాత.. ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందన్నారు. నివేదికపై కేబినెట్ నిర్ణయం తర్వాత.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తామని పవన్ తెలిపారు.
అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరుల్ని ఏర్పాటు చేయడం.. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాల్ని పెంపొందించడమన్నారు. అభివృద్ధి అంటే 4 కార్యాలయాల్ని ఏర్పాటు చేయడం కాదని తేల్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. రెండు రోజుల ముందు.. రాజధాని రైతులకు మద్దతుగా మరో మెగా బ్రదర్.. నాగబాబు.. రైతుల్ని పరామర్శించి.. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు.