పాటంటే… పల్లవి, చరణం, రాగ యుక్తమైన ఆలాపన ఇదే కదా..? కానీ ఆ రూల్‌ని బ్రేక్ చేశాడు పూరి. తనలో ఓ కవి, రచయిత ఉన్నాడు కదా. ఇప్పుడు కలం పట్టి ఓ పాట రాశాడు. తన తనయుడి సినిమా `రొమాంటిక్` కోసం. ఇది పాటంటే పాట కాదు. కొన్ని మాటలు. హీరో, హీరోయిన్లు గోవా బీచ్‌లో, సరసాలాడుకుంటూ, రొమాంటిక్‌గా మాట్లాడుకునే మాటలు. దాన్ని మరింత రొమాంటిక్‌గా తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే వీడియో రూపంలో విడుదలైంది కూడా.
పూరిపై చలం భావాలు కనిపిస్తాయి. ఈ అక్షరాల్లోనూ ఆయనే ధ్వనించాడు. చలంలా ఈ పాటని లిఖించాడు.
దేశాన్ని ప్రేమించడం వేరు – ఆడదాన్ని ప్రేమించడం వేరు.
ఐ లవ్ ఇండియా – రూపాయి ఖర్చుండదు.
ఐ లవ్ యూ – సరదా తీరిపోతుంది.. అనే పూరి మాటలతో ఈ వీడియోకి శ్రీకారం చుట్టారు.
రేయీ పగలూ ఎదరు చూశాయి ఈ క్షణం కోసం
కోటి దండాలు పెట్టుకున్నా – ఈ ఘడియ కోసం
దిండులో మొహం దాచుకుంటే నా ఊపిరి నాకే నీ ఊపిరిలా తగులుతోంది.
ఆ చలిలో, వెచ్చటి దుప్పటిలో నా కుడి చేయి ఎడమ చేయిని తాకితే…. అది నీదే అనుకుంటున్నా..
ఇలా సాగాయి ఈ మాటలు. చిన్మయి గొంతులో ఈ పదాలు మరింత పొయెటిక్ గా అనిపించాయి. మధ్యమధ్యలో పూరి ఆకాష్ కూడా తన గొంతు వినిపించాడు.
మొత్తానికి ప్రేమికుల భావాలకు, విరహానికీ, కోరికకూ అద్దం పట్టాడు పూరి. ఈ రొమాంటిక్ లో ఇంకెన్ని కోణాలున్నాయో చూడాలి.