తుళ్లూరు నుంచి రాజధానిని విశాఖ జిల్లా భీమిలికి మార్చాలని జగన్ నిర్ణయించారని.. ఆయనకు రైట్ హ్యాండ్ లాంటి విజయసాయిరెడ్డి భీమిలీలోనే ప్రకటించారు. నిన్నటిదాకా విశాఖలో.. రుషికొండ బీచ్లో రాజధాని ఉంటుందనుకున్న ప్రజలు.. ఇప్పుడు… అక్కడ్నుంచి మరో పాతిక కిలోమీటర్ల దూరం.. సముద్రం ఒడ్డున … చిటారుకొమ్మన ఉన్న భీమిలికి ఫిక్సవ్వాల్సి ఉంది. భీమిలిగా ప్రసిద్ధి చెందిన భీమునిపట్నం మంచి బీచ్ సిటీ. విశాఖ నుంచి… పాతిక కిలోమీటర్ల దూరం పాటు బీచ్ రోడ్ ఉంటుంది. ఆహ్లాదంగా ఉంటుంది. అద్భుతమైన ప్రకృతి రమణీయం ఉంటుంది. అక్కడే జగన్మోహన్ రెడ్డి రాజధాని పెట్టాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరీ పాలనా కేంద్రాన్ని ప్రతిష్టించాలనుకుంటున్నారు.
అమరావతిలో రాజధానిని ఎత్తేయడానికి ప్రధాన కారణం.. అక్కడ వరదలు వస్తాయని ప్రభుత్వం చెప్పడమే. తాము చెప్పడమే కాదు.. నిపుణుల కమిటీతోనూ అదే నివేదిక ఇప్పించారు. అక్కడ వరదలు వచ్చే అవకాశం లేదని.. గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా స్పష్టం చేసింది. గత పాతికేళ్ల కాలంలో.. తుళ్లూరు గ్రామాల్లోకి వరదలు రావడం చూడలేదని… అందరూ చెబుతున్నారు. రికార్డులు కూడా చెబుతున్నాయి. అయినప్పటికీ.. మార్చేస్తున్నామని ప్రకటించి… ఆ తర్వాత ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. భీమిలిని ఎంచుకున్నారు.
మరి భీమిలిలో వరదలు రావా..? భీమిలిలో వరదలు రావు.. కానీ.. తుపానులు వస్తాయి. అది తీర ప్రాంతం.. తుపానులు తరచూ వచ్చే ప్రాంతం. హుదూద్ లాంటి తుపాన్లు కూడా పలకరిస్తూ ఉంటాయి. కొన్నాళ్ల క్రితం వచ్చిన హుదూద్కి.. విశాఖ మొత్తం కొట్టుకుపోయింది. ప్రభుత్వ సంకల్పంతో నిలబడింది కానీ.. లేకపోతే.. ఇప్పటికి శిధిలావస్థలోనే ఉండేది. ఆ తర్వాత కూడా పలు తుపాన్లు వచ్చాయి. ఈ తుపాన్ల తీవ్రత భీమిలి మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. అతి అత్యంత చిట్టచివరి .. తీర ప్రాంతం. మరి వరదలు అంటే భయపడి.. రాజధానిని మార్చేస్తున్న ఏపీ సర్కార్.. తుపాన్లు తరచూ పలకరించే భీమిలిని ఎందుకు ఎంపిక చేసుకుందో మరి..!?