రాజధాని భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని అనిపిస్తోందని.. దాదాపుగా ఐదు వేల ఎకరాల్లో అక్రమాలు ఉన్నట్లుగా… తెలుస్తోందని.. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని… జనసేన పార్టీ నేత నాగబాబు… తన నా ఇష్టం యూట్యూబ్ చానల్ లో విడుదల చేసిన వీడియోలో చెప్పారు. తమకు న్యాయం చేయాలని రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు.. మరో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటు వెళ్లిన ఆయన సంఘిభావం ప్రకటించి వచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడానన్నారు నాగబాబు. ఈ వీడియోలో… రాజధాని భూముల లెక్కలు చెప్పారు మెగా బ్రదర్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సేకరించిన మొత్తం 34,322 ఎకరాలు అయితే.. ఇచ్చిన మొత్తం రైతుల సంఖ్య 29,881 అన్నారు. ఇందులో 5 వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని వైకాపా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అది వాస్తవంగా జరిగి ఉండొచ్చని విశ్లేషించారు.
నిజానికి ఇలాంటి అక్రమాలపై విచారణను.. ప్రభుత్వం ఏడు నెలల కిందటే ప్రారంభించింది. అధికారం అందిన మొదటి రోజుల్లోనే… ప్రభుత్వం రాజధాని భూములపై విచారణ ప్రారంభించింది. ఈ విచారణ ఎంత సీరియస్గా జరిగిందంటే… రిజిస్ట్రేషన్ పత్రాలను.. తనిఖీలు చేయడమే కాదు… అమ్మిన, కొన్న రైతుల ఇళ్ల వద్దకు సీఐడీ అధికారుల్ని పంపి కూడా.. విచారణ జరిపారు. కానీ ప్రభుత్వం ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టలేదు. అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించిన హెరిటేజ్ భూములు.. ఇతరుల భూములు… కోర్ క్యాపిటల్ ఏరియా… అంటే సేకరించిన 35వేల ఎకరాల్లోనివి కావు. అమరావతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. ఏడు నెలల పాటు ఏమీ బయట పెట్టనందునే.. టీడీపీ నేతలు.. ప్రభుత్వాన్ని పదే పదే సవాల్ చేస్తున్నారు. నిరూపణ అయినా చెయ్యాలని.. లేకపోతే క్షమాపణ అయినా చెప్పాలని. కానీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ.. ఇంకా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాటిని ఇప్పుడు నాగబాబు.. అందుకున్నారు.
నిజానికి నాగబాబు ఈ వీడియోలో.. సన్న.. చిన్నకారు రైతులు ఎంత మంది ఉన్నారో స్పష్టంగా చెప్పారు. 29881 మంది రైతులు 34322 ఎకరాలు ఇచ్చారు. అంటే.. సగటున.. ఒకటిన్నర ఎకరం కూడా లేదు. ఈ వివరాలన్నీ నాగబాబు స్పష్టంగానే చెప్పారు. ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు భూములు ఇచ్చిన రైతులు 5,227, రెండు నుంచి ఐదు ఎకరాలలోపు భూమి ఇచ్చిన రైతుల సంఖ్య 3,337, ఐదు నుంచి 10 ఎకరాల్లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 668, 10 నుంచి 20 ఎకరాల్లోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య కేవలం 142, 20 నుంచి 25 ఎకరాలలోపు భూములు ఇచ్చిన రైతుల సంఖ్య ఇంకా తక్కువగా కేవలం 12 మాత్రమే. 25 ఎకరాలకు పైగా భూమలు ఇచ్చిన వారు ఐదుగురు మాత్రమేనని నాగబాబు స్పష్టంగా చెప్పారు. ఇక బినామీలు.. అక్రమాలు ఉంటే.. కనిపెట్టడం.. పెద్ద విషయం కాదు. కానీ.. ఏడునెలలైనా సర్కార్… ఆరోపిస్తూనే ఉంది. నాగబాబు లాంటి వాళ్లు అనమానాలు పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.