ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలకు… ఓ విధానం అంటూ లేకుండా పోయింది. అత్యంత కీలకమైన విషయాల్లో.. ఒక్క మాట మాట్లాడటం లేదు. ఒక్కొక్కరు … ఒక్కో విధానాన్ని మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. నోరున్న ప్రతీ నేతా… హాట్ టాపిక్లపై ప్రెస్మీట్లు పెట్టేస్తున్నారు. వారు పార్టీ విధానం చెబుతున్నారో.. వ్యక్తిగత అభిప్రాయం చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ.. తమ వాదనను మాత్రం.. చాలా గట్టిగానే వినిపిస్తున్నారు. ఢిల్లీలో ప్రెస్మీట్లు పెట్టే సుజనా చౌదరి, గుంటూరులో ఆ పని చేసే కన్నా.. విజయవాడకు వచ్చినప్పుడల్లా గొంతు సవరించుకునే విష్ణువర్ధన్ రెడ్డి.. రాజమండ్రిలోనే.. గొంతెత్తే సోము వీర్రాజు.. ఇలా.. ఎవరికి వారు.. తమ విధానమే.. పార్టీ విధానమన్నట్లుగా ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హాట్ టాపిక్ గా ఉంది. జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌పై.. బీజేపీలో స్పందించిన వారంతా.. భిన్నంగా స్పందించారు. రాజధానిని తరలిస్తే.. ఊరుకోబోమని… సుజనా చౌదరి.. ఓపెన్ వార్నింగ్ ను ఏపీ సర్కార్ కు పంపారు. కన్నా లక్ష్మినారాయణ కాస్త ఘాటు తగ్గించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామన్నారు. పరిపాలనా రాజధాని అమరావతిగానే ఉండాలన్నారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారైతే.. మరో వాదన వినిపించినా.. జగన్ పై విమర్శలు చేశారు. ఇక మరో అధికార ప్రతినిధి రమేష్ నాయుడు.. విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడి.. అక్కడికి రాజధానికి మార్చారని.. ఆరోపణలు చేసేశారు. వీరందరూ… స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోయినా… రాజధాని తరలింపుపై మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేశారు.
వీరందరికీ భిన్నంగా సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా తెరపైకి వచ్చారు. రాజధాని గురించి మర్చిపోవాలని అందరికీ సలహా ఇచ్చారు. త్వరలో జగన్ ఇరవై ఆరు జిల్లాలను చేస్తారని.. అందుకే.. సమగ్రాభివృద్ధి చేస్తారన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా.. చంద్రబాబును తాను వదిలి పెట్టనని కూడా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం వల్లే.. రాష్ట్ర విభజన జరిగిందనేది ఆయనవాదన. మొత్తానికి బీజేపీ నేతలు.. వ్యక్తిగత రాజకీయ కక్షలతో.. ఎవరి విధానాలను వారు ప్రకటిస్తున్నారు. ప్రజలకు గందరగోళం మిగులుస్తున్నారు.