ఏడాది పాటు మద్యాన్ని మీ గ్రామంలో లేకుండా చేయగలరా? అలా చేస్తూ రూ. 5 లక్షల నగదు బహుమానం..! ఇదేదో ఆంధ్రాలో ప్రకటించిన పథకం కాదండీ, తెలంగాణదే! ఇక్కడ మద్య నిషేధం లేదు కదా, పైగా ధరలు పెంచి మరీ ఆదాయాన్ని పెంచుకోవాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది కదా? అలాంటప్పుడు ఇలాంటి ఆకర్షణీయమైన పథకాన్ని ఎవరు ప్రకటిస్తారు..? ఇంకెవరు.. కాంగ్రెస్ పార్టీవారే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో మద్యం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయనీ, యువత పెడతోవ పడుతోందనీ, అయినాసరే మద్యాన్ని ఏరులై పారించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. మద్యాన్ని ఒక ఆదాయవనరుగా చూస్తూ ఎడాపెడా బెల్టు షాపులు పెడుతోందన్నారు. దీని వల్ల గ్రామాల్లో పేదల కుటుంబాలు అన్యాయమైపోతున్నాయన్నారు. జరుగుతున్న నేరాల్లో మద్యం పాత్రే ఎక్కువ ఉంటోందన్నారు. మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అందుకే, తానొక నిర్ణయాన్ని తీసుకున్నాననీ.. 2020, జనవరి ఒకటో తేదీ నుంచి, 2020 డిసెంబర్ వరకూ…. మునుగోడు నియోజక వర్గ పరిధిలో బెల్టు షాపులు ఉండకూడదన్నారు. ఏ గ్రామంలో కూడా బెల్టు షాపు కనబడకూడదన్నారు. నియోజక వర్గ పరిధిలో ఇదే తరహా తీర్మానంతో ఒక గ్రామం ముందుకొచ్చిందనీ, బెల్టు షాపులు తీయించేసిన వారికి ప్రోత్సాహకంగా రూ. 5 లక్షల నగదును తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున ఆ పంచాయతీకి ప్రకటించానన్నారు. ఇదే తరహాలో అన్ని గ్రామాలు ముందుకు రావాలనీ, రాబోయే రోజుల్లో బెల్టు షాపులు లేని గ్రామ పంచాయతీలకు ఫౌండేషన్ తరఫున నిధులు అందిస్తామన్నారు.
మద్యం మానేస్తే గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం… ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది. అదీ, ప్రతిపక్షంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి తన నియోజక వర్గంలో ఇలాంటిది చేపట్టడం విశేషమే. ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ, నాయకులు కూడా ఇలానే తమ సొంత నియోజక వర్గాల్లో మద్య నిషేధం చేస్తే… పంచాయతీకి నగదు ప్రోత్సాహం అని ప్రకటిస్తే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చేది అవుతుంది. దాంతోపాటు రాష్ట్రంలో కొంతమేర మద్య నియంత్రణకు ఇదో మంచి ప్రయత్నం అవుతుంది. అయితే, ఇతర కాంగ్రెస్ నేతలు దీన్ని అనుసరిస్తారా, సొంత జేబుల్లోంచి సొమ్ము తీసి ప్రోత్సాహకాలంటే ముందుకొస్తారా అనేది ప్రశ్నే?