పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రేగిన మంటలు.. దేశం మొత్తం విస్తరిస్తూండటంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… సంచలన ప్రకటన చేశారు. దేశం మొత్తం .. జాతీయ పౌర గణన పట్టిక రూపొందించాలన్న ఆలోచన లేనే లేదని.. అసలు అలాంటి చర్చ ప్రభుత్వంలో జరగలేదని ప్రకటించారు. ఢిల్లీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నరేంద్రమోడీ… వేదికపై ఎన్నార్సీపై యూటర్న్ తీసుకున్నారు. ” 2014లో మొదట మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నడూ దేశవ్యాప్త ఎన్ఆర్సీపై చర్చ జరపలేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వు కారణంగానే అసోంలో దాన్ని అమలు చేయాల్సి వచ్చింది…” అని వివరణ ఇచ్చారు. మోడీ ఇలా ఒక్క సారిగా ఎన్నార్సీపై యూటర్న్ తీసుకోవడం.. కలకలం రేపుతోంది.
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో. … నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్ షిప్ను రూపొందించారు. దీని వల్ల.. కొన్ని లక్షల మంది పౌరసత్వం కోల్పోయారు. వారందర్ని డిటెన్షన్ సెంటర్లలో పెట్టారు. ఇప్పుడు.. ఆ ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం .. పదే పదే చెబుతోంది. అమిత్ షా పార్లమెంట్ లో కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పబట్టే.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇవి పెరిగి పెద్దవయ్యే వరకూ.. చూస్తూండిపోయిన.. కేంద్రం.. అదుపు చేయడం కష్టమని అనుకుందేమో కానీ…వెనక్కి తగ్గిట్లుగా ప్రకటనలు చేస్తోంది. అసలు అలాంటి ఆలోచనే లేదని.. మోడీ ప్రకటించడమే దీనికి కారణమంటున్నారు.
పౌరసత్వ బిల్లుపై ఆందోళనల్లో ఒక్క ముస్లింలు మాత్రమే పాల్గొనడం లేదు. వీటిపై హిందవులు కూడా.. ఆందోళనతో ఉన్నారు. తాము పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే.. తమను డిటెన్షన్ సెంటర్లలో పెడతారన్న భయమే దీనికి కారణం. దేశంలో.. చాలా మందికి… సరైన ధృవపత్రాలు ఉండవు. ఉన్నా.. దాచుకునేంత పరిస్థితులు… కోట్ల కుటుంబాలకు లేవు. పైగా.. రాజకీయం మొత్తం కమ్మేసిన పరిస్థితి. చట్టాలు.. గిట్టాలు.. ఏవైనా అధికారంలో ఉన్న వారు చెప్పినట్లు అమలు చేసే దుస్థితి ఉంది. అందుకే.. ప్రజల్లో.. ఆ ఎన్నార్సీ… పౌరసత్వ చట్ట సవరణ.. . సొంత దేశంలో పరాయి పౌరులుగా చూడటానికేనన్న అభిప్రాయం బలపడిపోయింది.