నందమూరి బాలకృష్ణ హీరోగా మూడురోజుల కిందట విడుదలైన రూలర్ సినిమా కు బాలకృష్ణ కు పట్టు ఉన్న రూరల్ ప్రాంతాల తో సహా అన్ని ప్రాంతాల నుండి ఏకగ్రీవంగా ఒకటే టాక్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంతగా తల బొప్పి కట్టిన సినిమా లేదంటూ సాధారణ జనాలు, దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ఇంతటి పేలవమైన సినిమా తీస్తాడని ఊహించలేదు అంటూ అభిమానులు వాపోతున్నారు. అయితే కథల ఎంపికలో బాలయ్యబాబు రూట్ మార్చాల్సిన అవసరం ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ దశాబ్దంలో రెండే హిట్లు:
బాలకృష్ణ ఈ దశాబ్దాన్ని 2011లో పరమ వీర చక్ర సినిమాతో ప్రారంభించాడు. అటు బాలకృష్ణ కెరియర్ లోను, దర్శకుడు దాసరి నారాయణరావు కెరీర్ లోనూ అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూసింది ఆ సినిమా. అదే సంవత్సరం విడుదలైన శ్రీరామరాజ్యం ఒక వర్గం ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే, ఆ తర్వాత విడుదలైన అధి నాయకుడు, ఊకొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ లాంటి సినిమాలు సాధారణ ప్రేక్షకుడి నే కాకుండా అభిమానులను కూడా నిరాశ పరిచాయి.
అయితే 2014 లో వచ్చిన లెజెండ్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ సత్తా చూపింది. కానీ అంతలోనే లయన్, డిక్టేటర్ వంటి చెత్త సినిమాలు తీయడం తో లెజెండ్ ద్వారా వచ్చిన సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. 2010 లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా తర్వాత 2014 లో లెజెండ్ తో మళ్లీ బోయపాటి తోనే హిట్ కొట్టడంతో, బోయపాటి లేకుండా బాలయ్యకు హిట్ రాదా అన్న సంశయం జనాల లో కలిగేలా చేశాడు బాల కృష్ణ . కానీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, లెజెండ్ స్థాయిలో కాకపోయినప్పటికీ బాగానే ఆడడంతో ఆ సంశయాన్ని బాలయ్యే తుడిచిపెట్టి నట్లయింది. మళ్లీ ఆ తర్వాత వచ్చిన పైసా వసూల్ బొక్క బోర్లా పడింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహ అనే సినిమా పండగ సీజన్లో పెట్టుబడి రాబట్టినప్పటికీ, దాన్ని నికార్సైన హిట్ గా అటు జనాలు గాని ఇటు ట్రేడ్ పండితులు కానీ ఒప్పుకోలేని పరిస్థితి. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు పేరిట వచ్చిన సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం మీద 2011-20 మధ్యలో లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేదు బాలకృష్ణకు .
బాలయ్య మల్టీస్టారర్స్ వైపు మొగ్గు చూపితే బాగుంటుందా?
తెలుగు తమిళ మలయాళ భాషలన్నింటిలోనూ సీనియర్ హీరోలు మల్టీస్టారర్స్ వైపు మొగ్గు చూపుతూ, కొత్త కథలు సృష్టించేలా రచయితలను ప్రోత్సహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2 సినిమా వసూళ్లలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాగార్జున సైతం ఫ్యామిలీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన “మనం” సినిమా తో నే కోల్పోయిన ఫామ్ రాబట్టుకున్నాడు. ఇక మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ స్టార్ విజయ్ కాంబినేషన్లో వచ్చిన జిల్లా సినిమా అప్పట్లో తమిళనాట రికార్డులు బద్దలు కొట్టింది.
బాలకృష్ణ లాంటి మాస్ హీరో మల్టీస్టారర్స్ కథలకు మొగ్గు చూపితే ఎన్నో కొత్త ప్రయోగాలకు, ఎన్నో కొత్త తరహా సినిమాలకు ఆస్కారం ఉంటుంది. మాస్ హీరో అయిన బాలకృష్ణ కోసం మల్టీస్టారర్లో పాత్రలు సృష్టించడం రచయితలకు ఒక సవాలుగా మారుతుంది. అటువంటి సవాళ్ల నుండి వచ్చే కొత్త రకం పాత్రలు బాలకృష్ణ కెరీర్ కే కాకుండా, సక్సెస్ రేషియో తక్కువగా ఉన్న తెలుగు పరిశ్రమ కి సైతం ఇతోధికంగా సహాయం చేస్తాయి.
మరి బాలయ్య రూటు మార్చి సక్సెస్ బాటలోకి వస్తాడా, లేదంటే ఐదేళ్లకోసారి పడే ఒక సూపర్ హిట్ తో తదుపరి ఐదేళ్ల పాటు కెరీర్ ని పేలవమైన సినిమాలతో కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాలి.