స్టీల్ ఫ్యాక్టరీ కడప జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. కావాల్సినంత ఐరన్ ఓర్ సమీపంలో ఉన్నప్పటికీ.. ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నాలు.. దశాబ్దాలుగా సాగుతున్నప్పటికీ.. శంకుస్థాపనల వరకే అది ముందడుగు పడుతోంది. కానీ.. అక్కడితో ఆగిపోతోంది. ప్రారంభోత్సవం వరకూ రావడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో.. ఐరన్ ఓర్‌కి స్వర్ణయుగం లాంటి సీజన్ నడుస్తోంది. వైఎస్ అనుంగు అనుచరుడు… గాలి జనార్దన్ రెడ్డి.. ఐరన్ ఓర్ మైనింగ్‌లో కింగ్‌లా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. ఆ మైనింగే ఆయనను కింగ్‌ను చేసింది. ఆ తర్వాత అదే మైనింగ్ ఆయనను జైలు పాలు చేసింది. అయితే.. మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు.. కడపలో ఆయనతో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టించాలని వైఎస్ తలంచారు. కావాల్సినన్ని భూములు ఇచ్చారు. విమానాశ్రయానికి కూడా వేల ఎకరాల భూములిచ్చారు. ఆ భూముల చుట్టూ గోడ కట్టే సరికే.. ఆయన సినిమా అయిపోయింది. జైలుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు.. ఆయన ఫ్యాక్టరీని కట్టే పరిస్థితుల్లో లేరని చెప్పి.. క్యాన్సిల్ చేసేశాయి. అక్కడితో మొదటి శంకుస్థాపన.. కథ ముగిసిపోయింది.
ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్రమే.. స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాల్సి ఉంది. కానీ.. చట్టంలో ఫీజుబులిటిని మాత్రమే చూడాలని ఉందంటూ.. కేంద్రం ఓ కమిటీని నియమించి.. ఫీజుబిలిటి లేదని నివేదిక ఇచ్చింది. దాంతో జిల్లా వాసుల ఆశలు అడియాసలయ్యాయి. అయితే.. చంద్రబాబునాయుడు పట్టువదలని విక్రమార్కుడిలా మరో కమిటీ వేయించారు. ఆ కమిటీ రకరకాల పరిశీలనలు జరిపింది. చివరికి అనుకూలంగానే ప్రాధమిక నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఈ లోపు.. టీడీపీ – బీజేపీ మధ్య సంబంధాలు చెడిపోయాయి. స్టీల్ ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ ఆమరణదీక్ష చేయడం.. డెడ్ లైన్ పెట్టి మరీ చంద్రబాబు.. శంకుస్థాపన చేయడం.. ఎన్నికల ముందు.. ఓ ప్రహసనంలా జరిగిపోయింది. చంద్రబాబు ఓడిపోవడంతో.. అది.. సైడైపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో.. మరోసారి.. తాను ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తానని… సవాల్ చేశారు. అనుకున్నట్లుగానే ఆరు నెలల్లో శంకుస్థాపన చేశారు. వరుసగా ఇది మూడో సారి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం. కానీ.. ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎవరు నిర్మిస్తారు..? ఎవరు పెట్టుబడి పెడతారు..? ఎవరి భాగస్వామ్యంతో నిర్మిస్తారు..? లాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రైవేటు పెట్టుబడితో ఏపీ సర్కార్ నిర్మిస్తుందా..? పూర్తిగా ప్రైవేటుగానా.. విభజన చట్టంలో భాగంగా.. కేంద్రం నిర్మిస్తుందని ఆశ పడుతున్నారా.. అన్నదానిపై.. అసలు క్లారిటీలేదు. సీఎం జగన్.. సొంత జిల్లాలో శంకుస్థాపన చేసి.. దాన్ని ప్రారంభోత్సవం కూడా చేస్తే హర్షిస్తారు. లేకపోతే.. కడప జిల్లా ప్రజల ఆశలతో.. ఆడుకున్నట్లు అవుతుంది.