మోడీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకం అనుకుని తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా… అబ్బే, ఇది దేశమంతా అమలు చేయాలన్నది తమ ఆలోచన కాదంటూ నాలిక మడతేశారు. ఇంకోపక్క, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, పంజాబ్ లు భాజపాయేతర పాలిత రాష్ట్రాలు కాబట్టి, సహజంగానే దీన్ని వ్యతిరేకించి, అమలు చేయడం లేదని స్పష్టం చేసేశాయి. భాజపా మిత్రుడు నితీష్ కూడా బీహారులో ఇది అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన వైకాపా కూడా, ఏపీలో ఈ చట్టానికి వ్యతిరేకమని ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఇదే అంశమ్మీద తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి ఏంటనేది ప్రశ్న?
సి.ఎ.ఎ.ని పార్లమెంటులో వ్యతిరేకించిన రాజకీయ పార్టీల్లో తెరాస కూడా ఉంది. అయితే, అక్కడ వ్యతిరేకించి… రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి దీని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ మాట్లాడలేదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తారా లేదా అనేది చెప్పడం లేదు. ఎలాగూ భాజపా వ్యతిరేక వైఖరినే ఈ మధ్య తలకెత్తుకున్నారు కాబట్టి, దీన్ని అమలు చెయ్యంగాక చెయ్యం అని కేసీఆర్ కుండ బద్దలుగొట్టొచ్చు. కానీ, ఎందుకు చేయడం లేదు..? ఈ ప్రశ్నకు సమాధానం… ముఖ్యమంత్రి కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనంగానే చూడాలి. ఇంకోపక్క… కేసీఆర్ కి మిత్రపక్షమైన ఎమ్.ఐ.ఎమ్. దీనిపై సభలు పెట్టి ప్రచారం చేసుకుంటోంది.
నిజానికి, ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో మాట్లాడి… ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం కేసీఆర్ చేసుకోవచ్చు. అలా ఎందుకు చేయడం లేదంటే… భాజపా నుంచి ఉన్న పక్క బెదురే కారణం! హిందుత్వ అంశాన్ని ప్రయోగించడానికి ఎక్కడైనా ఛాన్స్ దొరికితే… నూటికి నూరుశాతం భాజపా లాభపడుతుంది. తెలంగాణలో కూడా ఆ అవకాశం కోసమే చూస్తోంది. ఇలాంటి సందర్భంలో… ఇదిగో సి.ఎ.ఎ.ని వ్యతిరేకించామని బలంగా చెప్పుకుంటే… దాన్ని కేసీఆర్ అనుసరిస్తున్న హిందు వ్యతిరేక వైఖరిగా భాజపా చిత్రించే అవకాశం లేకపోలేదు! అలాంటి అవకాశం భాజపాకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేది కేసీఆర్ వైఖరిగా కనిపిస్తోంది. అయితే, దీని మీద మౌనంగా ఉందామన్నా కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ సీఎం జగన్ దీన్ని వ్యతిరేకించారు. కాబట్టి, ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తారు అనే ఆసక్తి నెలకొంది.