హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలంటూ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ దంపుతులు తమ ఆందోళనను ఎట్టకేలకు విరమించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రతినిధులుగా ఇవాళ ఉదయం కిర్లంపూడి వచ్చిన కళావెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు ముద్రగడతో గంటకుపైగా జరిపిన చర్చలు ఫలించాయి.
తర్వాత కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్‌కు ఈ ఏడాది రు.500 కోట్లు, వచ్చే బడ్జెట్లో రు.1,000 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు కళావెంకట్రావు తెలిపారు. కాపు కార్పొరేషన్ నివేదిక 9 నెలల్లోపే వచ్చే అవకాశముందని చెప్పారు. ముద్రగడ సూచించిన ఒక వ్యక్తికి మంజునాథ్ కమిషన్‌లో సభ్యుడిగా నియమిస్తామని తెలిపారు. అమాయకులపై కేసులు పెట్టకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కాపు కమిషన్ ముందున్న దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేస్తామని చెప్పారు. కాపుల ఆకలిని తీర్చాలనే రోడ్డెక్కానని ముద్రగడ చెప్పారు. రిజర్వేషన్లు ఆలస్యం కావటంతో దీక్ష చేపట్టానని అన్నారు. బీసీలకు అన్యాయం జరగాలని తాను కోరుకోవటం లేదని చెప్పారు. ఉద్యమానికి సహకరించినవారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనతోపాటు నిరాహారదీక్షలు చేస్తున్నవారందరూ దీక్షను విరమించాలని సూచించారు. తన దీక్షకు మద్దతిచ్చిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, దాసరిలకు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు, లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వయసు మీద పడిందని, మళ్ళీ రోడ్డెక్కేలా చేయొద్దని ముఖ్యమంత్రిని కోరారు. తాను ఏమైనా అభ్యంతరకరంగా మాట్లాడిఉంటే క్షమించాలని ముద్రగడ అన్నారు.