తెలంగాణలో మున్సిపల్ ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఎన్నికకు వచ్చే నెల 7న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 8 నుంచి 10వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మర్నాడే స్క్రూట్నీ ఉంటుంది. నామినేషన్లకు సంబంధించిన అప్పీల్స్ పై తుది నిర్ణయం 13న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన 14న జరుగుతుంది. పోలింగ్ 22వ తేదీన జరుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ 24న పూర్తి చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ జనవరి 25న ఉంటుంది. మొత్తం ప్రక్రియను ఒకే నెలలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లు డెప్యూటీ మేయర్లు… అన్నీ జనవరి నెలాఖరుకు పూర్తయిపోతాయి.
ఎన్నికల ప్రచారం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభం కానుంది. ఆ తరువాత కూడా మహా అయితే ఓ వారం పాటు మాత్రమే ప్రచారానికి అభ్యర్థులకు సమయం ఉన్నట్టు. అయితే, ఇప్పటికే చాలామంది తామే అభ్యర్థులమని చెప్పుకుంటూ ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. ఇక, ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగానే ఈ మధ్య వరుసగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకుని తీరతామని ప్రయత్నిస్తున్న భాజపా… మద్య నిషేధ ఉద్యమం, మూసీ నది ప్రక్షాళన, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సీఏఏ గురించి ప్రజలకు వివరించడం, కేంద్ర పథకాలను ప్రచారం చేసే పనిలో ఆ పార్టీ నేతలు ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆస్త ఆలస్యంగా, దిశ ఘటన అనంతరం యాక్టివేట్ అయింది. వారిదీ కేసీఆర్ సర్కారు వైఫల్యాల ప్రచారమే ప్రధానాస్త్రం.
భాజపా, కాంగ్రెస్ లు ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి, సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న ఎన్నిక కోడ్ వారిపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, అధికార పార్టీ తెరాస మీద కోడ్ ప్రభావ ఉంటుంది! ఎందుకంటే, గడచిన పదిరోజులుగా మంత్రులూ ఎమ్మెల్యేలూ జిల్లాల్లో తీవ్రంగా పర్యటనలు చేస్తున్నారు. వరుసగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. వీటికి ఇప్పుడు బ్రేక్ పడ్డట్టే అవుతుంది. ఇంతవరకూ ఏం సాధించామో అదే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోడ్ అమల్లోకి రావడం వల్ల గత కొద్దిరోజులుగా కనిపిస్తున్న అధికార పార్టీ నేత హడావుడి తగ్గుతుంది. ప్రచార హడావుడి మళ్లీ పెరుగుతుంది.