అనుకున్నట్టే జరుగుతోంది. రూలర్ ఎఫెక్ట్ బోయపాటి సినిమాపై పడింది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు హోల్డ్‌లో కి వెళ్లింది. `రూలర్` కి భారీ నష్టాలు రావడంతో – నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కాస్త వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ తగ్గించమని నిర్మాత బోయపాటిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడట. అంతేకాదు.. బోయపాటి, బాలయ్యలు పారితోషికం తీసుకోకుండా, ఈ సినిమాలో వాటా తీసుకుంటేనే ఈ ప్రాజెక్టు చేస్తానని అంటున్నాడట. దాంతో బోయపాటి, బాలయ్యలు డైలామాలో పడినట్టు తెలుస్తోంది. బోయపాటి దాదాపు 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. బాలయ్య వాటా 10 కోట్లు. వీరిద్దరికీ పారితోషికాలు ఇవ్వకుండా, సినిమాలో భాగస్వాములు చేయాలన్నది నిర్మాత ఆలోచన. అలా చేస్తే.. బడ్జెట్ తగ్గుతుందని, నష్టాలు వచ్చినా తట్టుకోవచ్చని భావిస్తున్నాడట. ఈ ఆలోచనకు బోయపాటి, బాలయ్య సై అంటారా, లేదంటే మరో నిర్మాతని చూసుకుంటారా? అనేది తేలాల్సివుంది. బాలయ్య `ఎన్బీకే సినిమాస్` పతాకంపై కో ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నా, బోయపాటి తన పారితోషికాన్ని మినహాయించుకోవడానికి సిద్ధంగా ఉండకపోవొచ్చు. మరో నిర్మాత ఈ టీమ్‌లో చేరే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.