విజయసాయిరెడ్డి కార్యాలయం నుంచి హఠాత్తుగా మీడియాకు ఓ సమాచారం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే.. విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై సీబీఐ, ఈడీ విచారణకు..రాష్ట్రపతి ఆదేశించారని. అవునా..నిజమా.. అని మీడియా ప్రతినిధులు కాస్త క్రాస్ చెక్ చేసుకునేసరికి.. కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా.. జగన్ మీడియా.. విచారణకు ఆదేశం అంటూ..విస్తృతంగా ప్రచారం చేసేసింది. నిజానికి రాష్ట్రపతి భవన్ నుంచి విజయసాయిరెడ్డికి ఓ లేఖ వచ్చింది. దాని సారాంశం… సుజనా చౌదరిపై.. రాష్ట్రపతి విచారణకు ఆదేశించడం కాదు.
కొన్నాళ్ల కిందట విజయసాయిరెడ్డి… సుజనా చౌదరి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని.. విచారణ జరిపించారని… రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును..తాను కేంద్ర హోంశాఖకు పంపానని.. ఎక్నాలెడ్జ్మెంట్ మాత్రం.. విజయసాయికి అందింది. అంతే..దానికే.. ఓ వర్గం మీడియా సంబరాలు చేసుకోవడం ప్రారంభించింది. విజయసాయిరెడ్డి ఖాతాలో మరో విజయం… సుజనా చౌదరిపై విచారణ అంటూ బ్రేకింగ్ న్యూస్ వేసేశారు. సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.
ఆయనపై కేంద్రం ఎలాంటి విచారణలు ఆదేశించడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికే ఆయన పార్టీ మారారన్న ప్రచారం కూడా ఉంది. అందుకే.. సుజనాపై.. విచారణ అంటే.. ఎవరికీ పెద్దగా నమ్మకం కలగలేదు. అంతే అయింది. సుజనాపై విచారణకు ఆదేశిస్తే.. రాజకీయం వేరేలా ఉంటుంది.