” బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములను వేల కోట్ల మేరకు మింగేసినా… అలాంటి వ్యక్తిని వదిలేస్తే… ఇక భారతదేశంలో న్యాయం, చట్టం అనే పదాలకు విలువ వుండదు…”.. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సుజనా చౌదరి గురించి చేసిన వ్యాఖ్యలు. తాను రాష్ట్రపతికి రాసిన లేఖ.. రాష్ట్రపతి.. హోంశాఖకు పంపారని.. ఆయనపై విచారణ ప్రారంభమయిందని.. విజయసాయిరెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రపతికి ఏ లేఖ పంపినా.. అది సంబంధిత శాఖకు వెళ్తుందని.. సుజనా చౌదరి.. కౌంటర్ ఇచ్చారు. అది విచారణకు ఆదేశించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వెంటనే.. విజయసాయిరెడ్డి.. తనదైన శైలిలో భారత చట్టాల గురించి చర్చ ప్రారంభించారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తిని తక్షణం శిక్షించకపోతే.. న్యాయం, చట్టం అనే పదాలకు విలువండదని.. తీర్పిచ్చేస్తున్నారు.
నిజానికి.. భారత చట్టాల గురించి.. చాలా మందిలో ఉన్న ఆవేదననే విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. కొద్ది రోజుల కిందట దిశ ఘటన జరిగినప్పుడు.. ఆకృత్యాలు.. అఘాయిత్యాల నిందితులకు శిక్ష వేయడంలో ఆలస్యం కారణంగానే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు డిమాండ్లు వినిపించాయి. అప్పుడే.. ఆర్థిక నేరాల విషయంలోనూ.. అదే తరహా … స్పందన ప్రజల్లో రావాలని చాలా మంది కోరుకున్నారు. మృగాళ్లు చేసే ఆకృత్యాలు వ్యక్తులకు నష్టం చేస్తున్నాయి.. ఆర్థిక నేరగాళ్లు చేసే ఆకృత్యాలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారాయి. బ్యాంకుల్ని మోసం చేయడం.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం.. క్విడ్ ప్రో కో .. మనీలాండరింగ్ వ్యవహారాలతో.. వేల కోట్లు సంపాదించడం వంటి చర్యల వల్ల..దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేస్తున్నారు. వీరందర్నీ శరవేగంగా శిక్షించాలన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లోనూ ఉంది.
విజయసాయిరెడ్డి.. స్వయంగా భారత చట్టాలను అపహాస్యం చేస్తూ… ఏడేళ్లుగా.. తనపై నమోదైన తీవ్రమైన కేసుల విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారు. అవసరం లేని పిటిషన్లు వేస్తూ… విచారణ జరగనీయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తనపై నమోదైన అభియోగాలు సామాన్యమైనవి కావు. వాటిపై ఎంత త్వరగా విచారణ పూర్తయితే.. ప్రజలకు వ్యవస్థపై అంత నమ్మకం ఏర్పడుతుంది. కానీ విచారణ జరగకుండా.. ఆయనే అడ్డుకుంటూ… ఇప్పుడు ఆయనే.. చట్టాల గురించి.. ఆవేదన చెందుతున్నారు. సుజనా చౌదరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడితే… కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే.. ఇతర ఆర్థిక నేరగాళ్లనూ వదిలి పెట్టకూడదు. కానీ రాజకీయ పలుకుబడితో.. చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని అందరూ.. తప్పించుకునేవాళ్లే. మళ్లీ చట్టాలపై జాలి చూపేవాళ్లే.