ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టుల్లో ఆగిపోతున్నాయి. ట్రైబ్యునల్స్‌లో తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. అధికారం ఉందన్న ఉద్దేశంతో.. కక్ష సాధింపు చర్యల కోసమే.. శక్తియుక్తులన్నీ కేటాయిస్తూండటంతో.. అన్నీ.. ఆగిపోతున్నాయి. తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ వ్యవహారంలో.. క్యాట్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఏ ముఖ్యమంత్రి అయినా.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. క్యాట్ గతంలో ఎన్నో విచారణలు చేసింది కానీ.. ఓ ప్రభుత్వంపై ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భం లేదు. నిజానికి కృష్ణకిషోర్ వ్యవహారంలో ప్రభుత్వం చేసింది తప్పని.. ఏపీ సర్కార్ లోని ఉన్నత ఉద్యోగులకూ తెలుసు. అందుకే వారెవరూ… కృష్ణకిషోర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. చివరికి రిటైర్ అయినప్పటికీ.. ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన పీవీ రమేష్ ఉత్తర్వులిచ్చారు. నిజానికి ఆయన ఉత్తర్వులు చెల్లవు. కానీ ప్రభుత్వం చేయాలనుకున్నది చేసింది. చివరికి క్యాట్‌లో తీవ్రమైన విమర్శల పాలయింది.
రంగుల విషయంలోనూ అదే పరిస్థితి. హైకోర్టు.. ప్రభుత్వ భవనాలకు.. పార్టీ రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించింది. దానికి పంచాయతీ రాజ్ కమిషనర్ బాధ్యలు కాబోతున్నారు. ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలిచ్చారన్న కారణంగానే.. ఉత్తర్వులు ఇచ్చారు. రేపు కోర్టులో అధికారులు అదే వాదన చెబుతారు. కానీ.. చట్టాలను పట్టించుకోని అధికారులే బాధ్యులవుతారు. ఇక బార్ల విషయంలోనూ.. అదే తరహా ప్రవర్తన. నిబంధనలు.. చట్టాలు.. హక్కులు అంటూ.. కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా.. రాత్రికి రాత్రే బార్లను రద్దు చేసేస్తే.. యజమానులు ఊరుకుంటారా..? కోర్టు కూడా.. అదే చెప్పింది.. ఆ నిర్ణయంపై స్టే విధించింది. ఇవి మాత్రమే కాదు… ఏపీ జీవనాడి పోలవరం సహా.. ప్రతి ప్రధాన ప్రాజెక్ట్ ఇప్పుడు కోర్టు కేసుల్లో ఉండిపోయింది.
అధికారం అందిందనే… ఆత్రుతతో.. తాము ఏమైనా చేయగలమన్న అంతులేని విశ్వాసంతో.. ప్రభుత్వం చట్ట విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని ప్రైవేటు స్థలాలు, ఇళ్ల అభివృద్ధికి కేటాయించడం దగ్గర్నుంచి.. ఉద్యోగుల నియామకాల వరకూ ప్రతీ విషయంలోనూ.. ఈ చట్ట ఉల్లంఘన ఉంటోందంటున్నారు. నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడే కాబట్టి.. ప్రభుత్వం.. ఈ పరిణామాలను తర్వాత..తర్వాత అనుభవించాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.