అమరావతి గ్రామాల్లో వందల మంది పోలీసులు మోహరించారు. ఇరవై ఏడో తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ప్రభుత్వం తీరు.. మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనల కారణంగా.. రైతుల ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతోంది. దాంతో పోలీసులు కేబినెట్ భేటీ రోజు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతుల ఆందోళనల కారణంగా కేబినెట్ భేటీని విశాఖలో నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. భయపడి వెళ్లిపోయారన్న విమర్శలు వస్తాయన్న కారణం.. భారీ బందోబస్తుతో అయినా.. కేబినెట్ భేటీని వెలగపూడిలోనే నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటున్నారు.
చివరి క్షణంలో.. జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కు కేబినెట్ భేటీ మారవచ్చని కూడా చెబుతున్నారు. అప్పటి పరిస్థితిని బట్టి.. పోలీసుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కేబినెట్ భేటీ ఎక్కడ జరుగుతుందన్న దానిపై రకరకాల ప్రచారాలను.. కావాలనే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెలగపూడి సచివాలయానికి వెళ్లాలంటే.. రాజధాని గ్రామాల నుంచే వెళ్లాలి. అన్ని చోట్లా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మందడం గ్రామంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామస్తులకు నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వవొద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇరవై ఏడో తేదీన ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని.. పోలీసులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అమరావతి తరలింపు విషయంపై జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదిస్తే.. రాజధాని తరలింపునకు ఆమోదం తెలిపినట్లే అవుతుంది. అందుకే… రాజధాని రైతులు.. ఆ రోజున తీవ్రమైన ఆందోళన చేస్తారని ప్రభుత్వ వర్గాలు.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.