మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. ఇంకా చెప్పాలంటే.. తెరాసలో ఆ వేడి మెల్లగా బయటపడటం ప్రారంభమైంది. తెరాసకు హీటేముంది, ధీమాగానే ఉన్నారు కదా, ఎదురులేదు అనుకుంటున్నారు కదా, ప్రతిపక్షాలు అత్యంత బలహీనమై ఉన్నాయని భావిస్తున్నారు కదా! పైపైకి ఎంత చెప్పుకున్నా, ఈసారి భాజపా నుంచి ఆ పార్టీకి కొంత వాడీవేడీ పోటీ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే, భాజపాని ప్రధాన పోటీదారు అనే మాటను తెరాస నేతలు ఒప్పుకోరు కదా! ఆ పార్టీకి కేడర్ లేదు, లీడర్లు లేరు వారితో మాకు పోటీ ఏంటన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపించేసరికి… భాజపా లక్ష్యంగానే విమర్శలు ప్రారంభించారు. మాకు ఓటెయ్యకపోతే అభివృద్ధి ఆగిపోతుందంటూ, భాజపాని అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ ప్రచారం ప్రారంభించారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
కరీంనగర్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఈసారి భాజపాకి ఒక్క సీటు కూడా ప్రజలు ఇవ్వకూడదన్నారు. ఎందుకంటే, వారు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు! ఒక్క భాజపా కార్పొరేటర్ ని ప్రజలు గెలిపించినా… ఆ మేరకు అభివృద్ధి పనులు ఆగిపోవడం ఖాయమన్నారు. స్థానికంగా అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ప్రజలు గెలిపించాలనీ, ఇతర పార్టీలను ఆదరించకూడదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. వేరే పార్టీలు ఎన్ని ఎంతగా ప్రయత్నించినా తెరాస గెలుపును ఆపలేవన్నారు!
ఏ ఎన్నికలు వచ్చినా అధికారంలో ఉన్న పార్టీకే ఓట్లెయ్యాలి! ఇలా కోరడం వేరు, ఇదే చెయ్యాలంటూ శాసించడం వేరు. రెండో తరహాలో తెరాస తీరుంటోంది. ఇదెక్కడి సిద్ధాంతం? ఈ మధ్య హుజూర్ నగర్ ఎన్నికల్లో కూడా, మంత్రి గంగుల చెప్పిన ఈ సూత్రం ప్రకారమే, మా పార్టీకి ఓట్లేస్తేనే అభివృద్ధి, లేకపోతే అన్నీ ఆగిపోతాయనే ప్రచారం చేసుకుని తెరాస లాభపడింది. మున్నిపల్ ఎన్నికల్లోనూ అదే ప్రచారాస్త్రమా? నిజానికి, ఇది ప్రచారంలా కనిపించడం లేదు, ప్రజలకు హెచ్చరికలా ఉంది! మాకు ఓట్లెయ్యకపోతే అంతే సుమా అన్నట్టుగా వినిపిస్తోంది. అయినా.. ప్రతిపక్ష పార్టీలు గెలిచిన నియోజక వర్గాలు, కార్పొరేషన్లు ప్రభుత్వ పరిధిలోకి రావా? అధికార పార్టీకి అక్కడ బాధ్యత ఉండదా? ఇతర పార్టీలకు ఓట్లేసినవాళ్లను అధికార పార్టీ పట్టించుకోదా? ఇదేం వింత ధోరణి? అధికారంలో ఉన్నాం కాబట్టి, ఇదిగో ఫలానాది సాధించామని ప్రజలకు చెప్పాలి. స్థానిక సంస్థల్లో కూడా అవకాశమిస్తే మరింత చేస్తామని అనాలి. అంతేగానీ… ఇలా ప్రచారం చేసుకోవడం సరైందా?