గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆజ్ఞాతంలోకి పోయారని.. వస్తున్న విమర్శలతో.. ఆ ఆ పార్టీ నేతలు వ్యూహం మార్చారు. అందరూ కలిసి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని సమాచారం పంపారు. ఏమేం మాట్లాడుకోవాలి.. మాట్లాడిన తర్వాత ఎవరెవరు ఏమేమి అంశాలు మీడియాతో మాట్లాడాలన్నదానిపై ఇప్పటికే నోట్ రెడీ చేసి.. ఆయా ఎమ్మెల్యేలకు పంపినట్లుగా తెలుస్తోంది. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు అంతా.. సమావేశమై.. అభివృద్ధి వికేంద్రీకరణకే తాము మద్దతిస్తున్నామని ప్రకటన చేసే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అభివృద్ధి మొత్తం ఒక్క చోటే పోగుపడితే.. ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని అందుకే… సెక్రటేరియట్‌ను విశాఖకు తరలించడానికి అంగీకరిస్తున్నామని వారు ప్రకటన చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో.. ఈ సమస్య అంతా చంద్రబాబు వల్లే వచ్చిందని .. ఘాటు పదజాలంతో ఎదురుదాడి చేయడం కూడా ఎమ్మెల్యేల భేటీ తర్వాత చూడవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాయలసీమ ఎమ్మెల్యేలు.. అక్కడి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అక్కడి ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. కానీ కోస్తాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం.. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలిస్తున్నా… స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. కోస్తా ప్రాంతంలో ప్రజలు తమ వ్యక్తిగత అభివృద్ధి కన్నా..కులాన్నే పట్టించుకుంటారని..అందువల్ల తమకు నష్టం జరగదని..వారు అంచనాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా వైసీపీలో.. ఏదైనా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. ఏ ఒక్క లీడర్ కూడా.. తన ఇష్ట ప్రకారం మాట్లాడటానికి అవకాశం లేదు. ఎలా మాట్లాడాలో.. ముందుగానే చెప్పి.. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏ మీడియా సమావేశంలో.. ఏ ఏజెండాను అమలు చేయాలి.. ఎంత దారుణమైన భాషను వాడాలి.. అన్న దాన్ని బట్టి సామాజికవర్గాల వారీగా… కొడాలి నాని, పేర్ని నాని.. బొత్స.. ఇలా కొంత మందిని ఎంపిక చేసి మాట్లాడిస్తూంటారు. ఇప్పుడు.. రాజధాని విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.