ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా.. కులం క్యాన్సర్ కబళిస్తోంది. ఎన్నికల్లో విస్త్రతంగా జరిపిన ప్రచారం నుంచి సత్ఫలితాలు పొందిన కొన్ని పార్టీలు.. ఆ ఫార్ములాను.. అదే పనిగా వినియోగించుకుంటున్నాయి. అమరావతి రాజధాని ఓ సామాజికవర్గానిదే అని ప్రచారం చేసి.. చివరికి.. రాజధాని మారుస్తామన్నా.. ప్రజల్లో పెద్దగా స్పందన రాకుండా చేయగలిగారు అధికార పార్టీ నేతలు. అమరావతిలో రాజధాని ఉంటే.. ఓ సామాజికవర్గమే బాగుపడుతుందన్న ప్రచారాన్ని ఓ పార్టీ చేసింది. ఇప్పుడు మరో స్టేజ్‌కు వెళ్తున్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టకపోతే రాజకీయం చేత కానట్లే..!
సోషల్ మీడియా ప్రచారం.. అంటే.. ఇప్పుడు రెండు పోస్టులు.. రెండు ఫేస్ బుక్ పేజీలు కాదు. కులాల మధ్య చిచ్చు పెట్టం.. ప్రాంతాల మధ్య రచ్చ చేయం… మాది జనం కోసం చేసే రాజకీయం అని .. మడికట్టుకుని కూర్చునే రాజకీయం ఇప్పుడు లేదు. కులాల మధ్య చిచ్చు పెట్టినా.. ప్రాంతాల మధ్య రచ్చ చేసినా.. ప్రత్యర్థి పార్టీలపై కుల ముద్ర వేసినా.. ప్రాంతాల మధ్య విద్వేషం రేపినా… తమ పార్టీ బాగు కోసమే చేసుకోవాలి. జనాల గురించి.. అసలు ఆలోచించకూడదు. అలాంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇప్పుడు నడుస్తోంది. ప్రత్యేకంగా ఓ కుటీర పరిశ్రమలు పెట్టుకుని.. ఆర్టిస్టులతో.. ఆడియోలు..వీడియోలు రికార్డు చేయించి.. లీక్ చేయడం.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.
మత, ప్రాంతాల మధ్య శత్రుత్వం పెంచడం రాజకీయ చిట్కా..!
ఇంకా విశేషం ఏమిటంటే.. ఇలా చేసే పార్టీలే.. ఇతర పార్టీలపై నిందలేస్తూంటాయి. అంటే.. రివర్స్ ఎటాక్ అన్నమాట. దొంగే దొంగ..దొంగ అరవడం అన్న సూత్రాన్ని రాజకీయ పార్టీలు బాగా వంటబట్టించుకున్నాయి… రాజకీయ పార్టీలు బాధ్యతగా ఉంటే.. వారి పార్టీ కార్యకర్తలు కూడా బాధ్యతగా ఉంటారు. కానీ.. ఓ కులాన్ని.. ఓ మతాన్ని.. ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని కించ పరిచే మాటలు మాట్లాడి.. ఇతరుల వద్ద గొప్పలు పోయే రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. అధినేతలే ఆ మార్గం చూపిస్తూంటే.. కింది స్థాయి వారు చెలరేగకుండా ఎలా ఉంటారు..? ఇప్పుడా ప్రభావం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
బలయిపోతోంది ప్రజలే..!
ప్రజలు ప్రభుత్వాల నుంచి కుల రాజకీయాలు కోరుకోరు. మత రాజకీయాలు కోరుకోరు. ప్రభుత్వం నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని మాత్రమే కోరుకుంటారు. కానీ ఓ కులాన్ని నాశనం చేయడమే.. మీ కులం అభివృద్ధి.. మీ ప్రాంతం అభివృద్ధి అని రెచ్చగొట్టే పాలకులు.. తొలి సారి తయారయ్యారు. అందుకే.. ఏపీకి ఈ దుస్థితి దాపురించింది. ప్రపంచ దేశాల ముందు.. తలవంపులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు.. తెలుగువారంటే.. తెలివిగలవారు అనుకునే పరిస్థితి నుంచి… అత్యంత తెలివి తక్కువ వారు అనే స్థాయికి దిగజారిపోయింది. ఈ కులం క్యాన్సర్ ఇప్పటికే అడ్వాన్సుడ్ స్టేజ్‌కి దాటిపోయింది.