కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు బాగానే ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, వాటి అమలుకి వచ్చేసరికే… గుదిబండలా మారిపోతూ ఉంటాయి. కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పరిస్థితి కూడా దాదాపు ఇలానే మారుతోంది. ఈ పథకాన్ని అమలు చేయడం రానురానూ ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తోంది. గత ఏడాది అంటే.. ఎన్నికల ముందు వరకూ రబీ, ఖరీఫ్ సీజన్లు వచ్చిన వెంటనే ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం సరైన సమాయానికి అందుతూ వచ్చింది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక సీజన్లు మారిపోతున్నా రైతుబంధు సాయం సరైన సమయంలో అందడం లేదు.
రైతుబంధు పథకం కింద ఒక దఫా పూర్తిగా సాయం అందించాలంటే దాదాపు రూ. 7 వేల కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే, ఏడాదికి రూ. 14 వేల కోట్లు కావాలి. ప్రస్తుతం ఆర్థిక మాంధ్యమనీ, నిధుల సర్దుబాటు కష్టమౌతోందని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో… రైతుబంధుకు నిధుల సమీకరణ ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. అందుకే ఇప్పుడు చెల్లింపుల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఒకేసారి రైతులందరికీ కాకుండా… 3 ఎకరాలవారికి ఓసారి, 5 ఎకరాలున్నవారికి మరోసారి, అంతమించి భూములున్న రైతులకు ఇంకోసారి.. ఇలా విడతలవారీగా నిధులు విడుదల చేస్తే సర్దుబాటు చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవానికి మొదటి దఫా రైతుబంధు చెల్లింపుల్నే ప్రభుత్వం ఇంతవరకూ పూర్తిచేయలేని పరిస్థితి! అయితే, ఈ నెలాఖరుకి వాటిని పూర్తి చేసి, తరువాత నిధులు విడుదల చేస్తారట. ఆ నిధులు ఎక్కడి నుంచీ వస్తారంటే… తాజాగా లిక్కర్ ధరలు ప్రభుత్వం భారీ పెంచిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రతీనెలా దాదాపు రూ. 400 కోట్లు అదనపు ఆదాయం వస్తుంది. దాన్ని నేరుగా రైతుబంధు అకౌంట్లోకి మళ్లించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. అవీ చాలవు కాబట్టి… తాజాగా కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ పరిహారం రూ. వెయ్యి కోట్లలో కొంత భాగాన్ని రైతుబంధుకి బదలాయిస్తారట. సమీప భవిష్యత్తులో అవీ చాలవు కాబట్టి… వచ్చేవారంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నట్టు సమాచారం. రైతుబంధుకి ఇచ్చే అప్పుల్ని రాష్ట్రం ప్రభుత్వానికి ఉన్న ఇతర అప్పుల కింద జమకట్టొద్దనీ, దీన్ని ప్రత్యేకంగానే చూడాలని కోరనున్నారు. మొత్తానికి, రైతుబంధు అమలు రానురానూ రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. దానికంటే ఆలోచించాల్సిన మరో అంశం.. నిధుల సమీకరణకు ఇంత ప్రయాస పడాల్సిన పరిస్థితి ఒక ధనిక రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అనేది?