రాజధాని రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆషామాషీగా అనలేదు. ప్రభుత్వం వాటిని నిజంగానే తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచనలోనే ఉంది. అయితే.. బలవంతంగా కాకుండా.. కావాలనుకున్న వారికే తిరిగి ఇస్తామని మిగిలిన వారికి.. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక వేళ రోడ్లు, భవనాలు కట్టిన పొలాల యజమానులు… తమ భూములు తమకు ఇచ్చేయమంటే మాత్రం.. ఆ భూమికి విలువ కట్టి.. అంత మొత్తం ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే.. కొంత మంది అధికారులు ఓ నివేదిక సిద్ధం చేశారు. దీన్ని కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అమరావతి రైతులు.. కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. తమ ప్రాంతంలో హైకోర్టును కర్నూలు వాసులు స్వాగతిస్తున్నారు. కానీ రైతులకు న్యాయం చేయాలనంటున్నారు. విశాఖలోనూ అదే అభిప్రాయం వినిపిస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వం కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కోర్టుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతిమంగా అది రాజధాని తరలింపునకు అడ్డం పడే అవకాశం ఉంది. అందుకే రైతులతో.. సానుకూలంగా వివాదం పరిష్కారానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించాలనుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. ప్రభుత్వ ప్రయత్నాలపై రైతులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాజధాని రైతుల్ని.. ప్రభుత్వ పెద్దలు రకరకాలుగా కించ పరిచారు. కులం ముద్ర వేశారు. ముంపు ప్రాంతమన్నారు. బినామీలన్నారు. వారిలో అసహనం పెరిగిపోవడానికి.. ప్రభుత్వ పెద్దల వ్యవహారమే కారణం. మరి ఇప్పుడు.. వారు వేసే కమిటీతో.. రైతులు చర్చలు జరుపుతారా.. లేదా అన్నది.. ఆసక్తికరమైన విషయం.