ఏపీ ప్రజలు అన్ని సమస్యలు మర్చిపోయారు. అనేక సమస్యలు చుట్టుముట్టిన దశలో.. ఒక్క సమస్యను లేవనెత్తిన ప్రభుత్వం అన్నింటినీ పక్కకు తప్పించేసింది. ఇసుక కొరత సమస్య భవన నిర్మాణ రంగాన్ని, దానిపై ఆధారపడిన సుమారు 25 లక్షల కుటుంబాలను రోడ్డునపడేసింది. జనసేన, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు నిర్వహించిన ఆందోళనలతో రాష్ట్రం వేడెక్కింది. ఉల్లిపాయలు ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కిలో 150 రూపాయలకు చేరాయి. ఇప్పటికీ.. అందుబాటులోకి రాలేదు. రైతుబజార్లు, మార్కెట్ యార్డ్ ల వద్ద కిలోమీటర్ల మేర మహిళలు, వృద్ధులు ఉల్లిపాయల కోసం కిలో లైన్లలో నిలబడ్డారు.
మధ్యతరగతి, పేద ప్రజానీకానికి వేళకు మంచి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు మూతబడ్డాయి. 5 రూపాయలకే భోజనం అందించే ఈ క్యాంటీన్లు మూతబడటంతో పట్టణాలు, నగరాలకు, వివిధ పనులపై వచ్చే పేద వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ున్నాయి. మిర్చి మినహా మిగతా పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతాంగం అల్లాడిపోతోంది. ప్రస్తుతం పల్లెల్లో, పట్టణాల్లోనూ గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల్లో ఏసీలు, ఫ్రిజ్ లు ఉన్నవారికి రేషన్ కార్డులు, పెన్షన్ తొలగిస్తున్నారు.
ఇంటికి ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఈ సమస్యలతో పల్లెలు, పట్టణాల్లో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ సమస్యలేవీ కూడా బయటికి రావడం లేదు. తెలివిగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన జగన్.. పొలిటికల్ గేమ్ ప్రారంభించారని విపక్షాలకు క్లారిటీ వచ్చేసింది. కానీ వారేమీ చేయలేరు ..!