సామాన్యులు చేసే పనులకైనా, ప్రభుత్వాలు చేసే పనులకైనా కొన్ని కారణాలుంటాయి. ఆ కారణాలు సహేతుకం కావొచ్చు. అహేతుకం కావొచ్చు. ఏదైనా కారణాలు మాత్రం ఉంటాయి. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు కారణమేంటి? రాజధాని ఒక్క నగరంలోనే ఉండి, అక్కడ అభివృద్ధి అంతా కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అలా ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే, ఇతర ప్రాంతాల్లో లేదా జిల్లాల్లో అసంతృప్తి పెరుగుతుంది. అక్కడ అభివృద్ధి జరగదు. అక్కడి ప్రజలకు ఉపాధి కరువవుతుంది. కేంద్రీకృత వ్యవస్థ కారణంగా ఇలాంటి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు ఏపీలో చేయకూడదు. ఇదీ ఇప్పటివరకు అనేకమంది మేధావులు, వైకాపా నేతలు, పాలకులు చేసిన వాదన. మూడు రాజధానుల ఏర్పాటుకు కూడా ఇదే కారణం చెప్పారు.
పాలన వికేంద్రీకరణ జరిగితే మంచిదన్నారు. ఇందుకు ఉదాహరణగా సీఎం జగన్ దక్షిణాఫ్రికాను చూపించారు. కాని రాజధాని వికేంద్రీకరణకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యం కారణం కాదు. రాష్ట్రమంతా సమంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉండొచ్చు. కాని దాని కోసమే రాజధానిని విభజించామని చెప్పుకోవడం కరెక్టు కాదనిపిస్తోంది. ఈరోజు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే కదా. ఆ సమావేశం ముగిసిన తరువాత ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయాలు వింటే రాజధాని విభజన వెనక అసలు సీక్రెట్ అర్థమవుతుంది.
ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పలేదు. ఉన్న విషయమేదో సూటిగా చెప్పేశాడు. ఏమిటది? ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బులు లేవని, రాజధాని నగరాన్ని నిర్మించడం అయ్యే పని కాదని, కాబట్టి దాన్ని మూడు ముక్కలుగా విభజించి మూడు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పాడు. ఈ మూడు నగరాలు అంటే కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం భవిష్యత్తులో ఏవిధంగా అభివృద్ధి చెందుతాయనేది తరువాత సంగతి. నిజానికి అమరావతి ఒక నగరం కూడా కాదు. ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి రాజధానిని మూడు నగరాల్లో సర్దుబాటు చేస్తున్నారు.
దీనివల్ల ప్రత్యేకంగా ఓ మహా నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉండదు. కర్నూలులో హైకోర్టు భవనం కట్టుకోవాలి. అమరావతిలో ఆల్రెడీ అసెంబ్లీ భవనం ఉంది. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, ఆయనకు నివాసం, ప్రభుత్వ శాఖలకు భవనాలు, అధికారులకు, సిబ్బందికి భవనాలు కట్టుకోవాలి. అంటే ఏదైనా ఖర్చు పెడితే విశాఖలోనే పెట్టాలి. అమరావతిలో గత ప్రభుత్వం 5,800 కోట్లు ఖర్చు చేసిందని, ఈ నగర నిర్మాణానికి ఇంకా లక్షా 9 వేల కోట్లు ఖర్చు చేయాల్సివుంటుందని, అంత డబ్బు ఖర్చు చేసే ఆర్థిక స్తోమత సర్కారుకు లేదని అంబటి చెప్పాడు. భారీగా ఖర్చు పెట్టడానికి డబ్బు ఎక్కడినుంచి తేవాలని ఆయన ప్రశ్నించాడు.
జీఎన్‌రావు నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నాడు. అసలు రాజధాని నగరాన్ని లక్షల కోట్ల ఖర్చుతో నిర్మించాల్సిన అవసరం లేదని, అది తప్పుడు అభిప్రాయమని కూడా చెప్పాడు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్టణంలో ఉన్నప్పటికీ అమరావతి రైతులను సంతోషపెడతామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవని అంబటి చెప్పాడు.
అంబటి చెప్పిన మాటలతో తెలిసేదేమిటంటే…ప్రపంచంలోనే అద్భుత రాజధాని అమరావతి అని చంద్రబాబు అదే పనిగా ప్రచారం చేశారు. ఇక అది అంతర్థానమైపోయింది. ప్రపంచంలోని ఐదు గొప్ప రాజధానుల్లో అమరావతి ఒకటి అని బాబు చెప్పారు. ఆ కల కరిగిపోయింది. ఏది ఏమైనా మూడు రాజధానుల ఏర్పాటుతో సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును దెబ్బ కొట్టేశారు. ఆయన కలల్ని కల్లలు చేశారు. అమరావతి నిర్మాతగా చరిత్రలో ఆయనకు స్థానం లేకుండా చేశారు.