ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు! అవి చాలావరకూ ఫలించాయి. అందుకే, ఆయనకి ప్రగతి భవన్లో మాంచి గుర్తింపు! ఇంతకీ ఎవరంటే ఆయన.. రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఈయన పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. ఓదశలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మారుస్తారేమో అనే కథనాలు వచ్చినప్పుడు, ఆ స్థానం పల్లాకి దక్కుతుందనే ప్రతిపాదనలూ తెరమీదికి వచ్చాయి. మొత్తానికి, ఇప్పుడాయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత నేతగా మారిపోయారట! ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే తెరాస నేతలు కూడా ఇప్పుడు ఆయన్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రికి మెచ్చేలా పనులు చేసుకుంటూ, ఆయన దృష్టిని పల్లా ఇంతగా ఎందుకు ఆకర్షిస్తున్నారంటే… పార్టీ నుంచి ఏదో ఆశించకుండానే చేస్తారా..?
మంత్రి పదవి సాధించాలనేది పల్లా రాజకీయ లక్ష్యం. అయితే, రకరకాల సమీకరణల దృష్ట్యా ఆయనకి పదవి రాలేదు. దీంతో, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా సొంతంగా ఒక నియోజక వర్గాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు అదే పనిలోపడ్డారు. గత ఎన్నికల్లో నల్గొండ నుంచి ఆయన టిక్కెట్ ఆశించారు, కానీ రాలేదు. ఆ తరువాత, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ, తన సొంత జిల్లా వరంగల్ మీద ఇప్పుడు ప్రత్యక శ్రద్ధ పెట్టారు. ఎన్నడూ లేని విధంగా జనగామలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. సొంత గ్రామంలో ఇప్పుడో ఇల్లు కట్టుకుంటున్నారు. జనగామలో ఓ పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదెందుకు అంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ వరంగల్ జిల్లాకి వస్తే ఇక్కడ బస చేయడం కోసమట!
జిల్లా స్థాయిలో ఇలా, ప్రగతి భవన్ స్థాయిలో అలా… మెల్లగా పల్లా తన పట్టు పెంచుకుంటున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. ఎలాగూ ఇప్పుడు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. కాబట్టి, పార్టీలో తనకు ప్రాధాన్యత పెంచుకోవడం ద్వారా ఆ లోటును కొంతవరకూ భర్తీ చేసుకుంటున్నారని అనొచ్చు! మరో నాలుగేళ్ల తరువాతైనా వరంగల్ జిల్లా నుంచి గెలవాలంటే ఇప్పట్నుంచీ ప్రయత్నాలు ప్రారంభించాలి. తనకు కచ్చితంగా సీటు ఇచ్చే పరిస్థితిని తానే పార్టీకి కల్పించాలి! పల్లా ఇప్పుడు చేస్తున్నది ఇదే. మొత్తానికి, చాలా ముందుచూపుతో ఆయన వ్యవహరిస్తున్నారని అనిపిస్తోంది.