వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ -2గా ఉంటూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కళ్లూచెవులుగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి షోడో సీఎంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఆయన ముందుగానే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో.. ఏం చేయబోతోందో.. ముందుగానే ప్రకటించి.. తాను ఎంత పవర్ ఫుల్లో.. ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను కేబినెట్ లో చర్చిస్తామని మంత్రులు చెప్తుండగా, విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించి.. డిసెంబర్ 28వ తేదీన సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలుకుతామని ప్రకటించేశారు.
విజయసాయిరెడ్డి ప్రకటనను చూసిన వారెవరికైనా అసలు మంత్రివర్గానికి కనీస విలువ లేదా అని ఫీల్ అవకుండా ఉండరు. మంత్రులకు ఏమీ తెలియదు.. విజయసాయిరెడ్డి ఏది చెబితే అదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాజధాని మార్పు విషయంలో విజయసాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు.. అధికారిక నిర్ణయాలన్నింటిలోనూ ఆయన ముద్ర ఉంటుందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందర్నీ కలవరు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు దొరకవు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అందరికీ అందుబాటులో ఉంటారు.
జగన్ కూడా.. ఎక్కువగా విజయసాయిరెడ్డిని కలవాలని.. తనతో పనుల మీద వచ్చిన వారికి సలహాలు ఇస్తూంటారని చెబుతూంటారు. కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో విజయసాయిరెడ్డి మాటంటే..మాటేనని.. ఆయన షోడో సీఎంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలా… పదవికి మించి అధికారం చెలాయించేవారిని రాజ్యాంగేతర శక్తులుగా పలిచేవాళ్లు. విజయసాయిరెడ్డి కూడా.. ఈ బిరుదు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని..వైసీపీ నేతలే.. జోకులేసుకుంటున్నారు.