డిసెంబర్ 30వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ సమావేశం పై జనసేన నేతలు, శ్రేణుల కంటే కూడా వైఎస్ ఆర్సీపీ నేతల లో ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే…
జగన్ 3 రాజధానులు ప్రకటించిన తర్వాత దాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. అయితే ఇంతలోనే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ వైఖరిని నిర్ధారిస్తాం అని చెప్పారు. ఇటీవలి కాలంలో పలు విషయాల్లో మడమ తిప్పుతున్న జగన్ ఒకవేళ రాజధాని విషయంలో కూడా మడమ తిప్పి మళ్ళీ తన వైఖరి మార్చుకుంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జగన్ క్యాబినెట్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఇప్పుడు 30వ తేదీన పవన్ కళ్యాణ్ ఈ సమావేశం లో రాజధాని విషయంలో ఏ వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు చిరంజీవి కెమెరా ముందుకు వచ్చి సమర్థించక పోయినప్పటికీ , జగన్ నిర్ణయాన్ని చిరంజీవి స్వాగతించారు అంటూ సోషల్ మీడియాలో, మీడియా లో బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరిపై వైకాపా నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైకి జనసేన పార్టీ ని తాము పట్టించుకోము అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ప్పటికీ, పవన్ కళ్యాణ్ తీసుకునే వైఖరీ కచ్చితంగా ప్రజలను ప్రభావితం చేయగలదు అన్న అవగాహన ఉండడంతో 30వ తేదీన జరగనున్న సమావేశం పై జనసేన నేతలు శ్రేణులు కంటే కూడా వైకాపా నేతల లో ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది.
మరి రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటాడు అన్నది వేచి చూడాలి.