అయిపోయింది.. అంతా అయిపోయింది..! ఇక రాజధానిగా విశాఖ ప్రకటనే మిగిలింది. ఇది ఉదయం వరకూ.. వైసీపీ ప్రభుత్వ వర్గాలు గట్టిగా చెప్పిన విషయం. గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల సంగతేమో కానీ.. ఇప్పుడు మాత్రం జగన్ మాటలకు ఎదురు చెప్పే పరిస్థితి లేదని వారు నిర్ణయించుకుని ఎలా చెప్పేశారు. మరో వైపు.. షాడో సీఎంగా పేరు తెచ్చుకున్న వైసీపీ నెంబర్ -2 విజయసాయిరెడ్డి విశాఖలోనే రాజధాని అని ప్రకటనలు చేసి.. క్యాపిటల్ ప్రకటన తర్వాత .. శనివారం వైజాగ్ రాబోతున్న జగన్మోహన్ రెడ్డి.. కనీ వినీ ఎరుగని.. స్వాగతం చెప్పేందుకు భారీ ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. కానీ గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కేబినెట్ బేటీలో పైపైన చర్చించి.. మళ్లీ బంతిని నిపుణుల కమిటీల్లోకి నెట్టి నిర్ణయాన్ని వాయిదా వేశారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించి తరలిస్తారా..? ఇంత కాలం ఎందుకు ఆగినట్లు..?
రాజధానిపై.. నిర్ణయాన్ని తీసుకోలేకపోయిన అసహనం.. కేబినెట్ సమావేశ వివరాలను బయట పెట్టి నసమాచార పౌర సంబంధాల మంత్రి పేర్ని నాని మాటల్లో స్పష్టంగా వ్యక్తమయింది. రాజధాని లక్ష కోట్లు కావాలని.. ఎక్కడ్నుంచి తేవాలని పదే పదే పేర్ని నానిప్రశ్నించారు. అంత ఖర్చు పెట్టి… అభివృద్ధి చేసి.. అప్పు అంతా రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేయాలా.. అనే ప్రశ్నను కూడా…పేర్ని నాని వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఆరోపణలు చేసి.. నిరూపించకుండానే.. రాజధానిని తరలించే కుట్ర చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా రావడంతో.. కొత్తగా మరో ప్రకటన చేశారు. తాము చేస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతామని ప్రకటించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాజధాని భూములపై విచారణ జరిపించింది. మొదట రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వివరాలు మొత్తం బయటకు తెప్పించారు. తర్వాత సీఐడీ విచారణ కూడా జరిపారు. ప్రతీ రైతు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి విచారణ జరిపారు. మధ్యలో కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. ఇప్పుడు… ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పిందని.. విచారణకు ఆదేశించబోతున్నామని పేర్ని నాని చెప్పారు.
కమిటీల నివేదికల అందకే లేటా..? అదే అయితే ఇంత హడావుడి ఎందుకు చేసినట్లు..?
రాజధాని కోసం ప్రభుత్వం ఎప్పుడు కమిటీల్ని నియమించిందో ఎవరికీ తెలియడం లేదు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ను ప్రభుత్వం రాజధాని కోసం ఎప్పుడు నియమించిందో తెలియదు. మధ్యలో రూర్కి ఐఐటీ నిపుణుల కమిటీని నియమించినట్లుగా కూడా ప్రభుత్వం చెప్పింది. ఇంత కాలం.. ఈ కమిటీలను పట్టించుకోని జగన్ సర్కార్.. ఒక్క సారిగా.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వస్తుందని.. ఆ తర్వాత వాటిపై మరో హైలెవల్ కమిటీ వేస్తామని ప్రకటించారు. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి..
హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
న్యాయపరరమైన చిక్కులొస్తాయనుకున్నారా..? అసలు జగన్ కోర్టుల్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకున్నారు..?
న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకే మరికొంత సమయం తీసుకుంటున్నట్టుగా కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ అనేది.. చట్టబద్ధమైనది. రాజధాని నిర్మాణం కోసమే భూములను ప్రభుత్వం తీసుకుంది. రాజధానిని కట్టకుండా.. అభివృద్ధి చేసిన భూములు ఇస్తామంటే చట్టపరంగా చెల్లదు. అదే సమయంలో అసెంబ్లీ తీర్మానం ద్వారా రాజధాని ఏర్పటయింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. కనీసం 30వేల ఎకరాలుండాలని కూడా చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ.. కోర్టు విచారణల్లో కీలకమయ్యే అవకాశం ఉందని కొందరంటున్నారు. కానీ.. ఇప్పటి వరకూ.. కోర్టులు కొట్టి వేస్తాయని.. వెనక్కి తగ్గిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కాబట్టి.. ఇది కూడా కారణం అయి ఉండుదు.
మరెందుకు వెనక్కి తగ్గారు..?
మరి ఎందుకు …. జగన్ సిక్సర్ కొట్టడానికి ఫ్రంట్ పుట్‌కి వచ్చి మరీ వెనక్కి తగ్గారు…? ఈ విషయం టాప్ సీక్రెట్. ఎవరూ బయటకు చెప్పరు. కానీ ముందు ముందు జరిగే పరిణామాలను బట్టి.. అసలు కారణం ఏమిటో బయటకు వచ్చే అవకాశం ఉంది.