విశాఖలో ఇళ్లు, స్థలాలు, పొలాలు కొనాలనే వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రాజకీయ పార్టీల కార్యకర్తలు.. ఓ మాదిరి నేతలు అయితే.. ఇక పూర్తి స్థాయి రాజధాని ప్రకటన వరకూ.. వేచి చూడటమే బెటర్. లేకపోతే.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ.. వారిపై విచారణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టబోతున్నామని జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసినప్పటి నుండి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు విశాఖలో వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల అమాంతం రేట్లను కూడా పెంచేశారు. అధికారం చేపట్టినప్పటి నుండే… జగన్మోహన్ రెడ్డి విశాఖకు క్యాపిటల్ ను తరలించాలనుకుంటున్నారని.. అందుకే అక్కడ విజయసాయిరెడ్డి మిగతా పనులను పూర్తి చేశారని చెప్పుకున్నారు.
ఆయన నేతృత్వంలో సెటిల్మెంట్లు జరిగాయని.. కబ్జాలు చేశారని.. ఆరు వేల ఎకరాల లావాదేవీలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. గత మూడేళ్లలో ఆరు వేల ఎకరాల అమ్మకాలు, కొనుగోళ్లు విశాఖలో జరిగితే.. గత ఆరు నెలల్లో అది ఇరవై వేల ఎకరాలుందని.. టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో.. ఇప్పుడు.. ఎక్కడ ఏమి కన్నా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అయిపోతుందన్న భయాందోళనలు.. రియల్టర్లలో పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారంతా.. కచ్చితంగా ఏదో ఓ పార్టీకి సన్నిహింతగా ఉంటారు. ముఖ్యంగా అధికార పార్టీతోనే అంట కాగుతూ ఉంటారు. ఇలాంటి వారు ఇప్పుడు.. విశాఖలో ఎలాంటి లావాదేవీ జరపాల్సి వచ్చినా కంగారు పడాల్సిన పరిస్థితి.
ముఖ్యమంత్రి జగన్.. విశాఖ క్యాపిటల్ పై నిర్ణయం తీసుకోలేదని… మరి కొన్ని కమిటీల పరిశీలన తర్వాత తీసుకుంటామని చెప్పడం.. ముందుగా ఫలితం ప్రకటించి.. తర్వాత మ్యాచ్ ఆడినట్లుగా ఉందన్న అభిప్రాయం వస్తుంది. జగన్ ముందు విశాఖ పేరు ప్రకటించడం వల్ల అక్కడ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది.