రాజధానిని మార్చాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనూహ్యమైన సలహా ఎదురొచ్చింది. రాజధాని మార్పే అజెండాగా.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. గెలిచి.. రాజధానిని మార్చాలని.. సీపీఐ సీనియర్ నేత నారాయణ సలహా ఇచ్చారు. రాజధానిగా అమరావతిని మారుస్తానని జగన్ మేనిఫెస్టోలో చెప్పలేదని నారాయణ గుర్తు చేస్తున్నారు. విజయవాడనే రాజధానిగా … సీపీఐ మొదటి నుంచి సమర్థిస్తోందని ఆయన అంటున్నారు. ఓ రకంగా.. నారాయణ చేసిన సూచన.. సమంజసమేనని.. రాజకీయవర్గాలు అంటున్నాయి. వైసీపీ వస్తే..రాజధానిని తరలిస్తారని.. ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. అలాంటి చాన్సే లేదని.. కావాలంటే మేనిఫెస్టోలో పెడతామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
వైసీపీ అభ్యర్థులు అనేక మంది రాజధాని మారిస్తే రాజీనామా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వయంగా..జగన్మోహన్ రెడ్డి కూడా.. రాజధానిని మార్చబోమని ప్రకటించారు. అసెంబ్లీలో మద్దతు ప్రకటించానని పదే పదే గుర్తు చేశారు. అంతే కాదు.. తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని.. తన చిత్తశుద్ధికి అదే సాక్ష్యమని నమ్మించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని గుర్తు చేశారు. ఏ విధంగా చూసినా.. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు.. చివరకు జగన్ తో సహా.. ఎవరూ రాజధాని మారుస్తామని చెప్పలేదు.
పైగా… అమరావతినే రాజధానిగా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే… సీపీఐ నారాయణ సలహా ఇచ్చినట్లుగా.. రాజధాని ఎజెండాగా.. ఎన్నికలకు వెళ్లి ప్రజామోదం పొందితే.. రాజధాని మార్చవచ్చని.. కొంత మంది సలహా ఇస్తున్నారు. ఈ సలహా జగన్ కు నచ్చకపోవచ్చు.