జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ కోర్టులు.. ట్రిబ్యూనళ్లు తప్పు పడుతున్నాయి. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. పిచ్చి పాలనగా అభివర్ణిస్తున్నాయి. ఇలాంటి సమయంలో… అమరావతి విషయంలో.. న్యాయపరంగా.. ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. అనేక మంది న్యాయనిపుణులు ప్రభుత్వానికే నేరుగా చెప్పిన అభిప్రాయం ప్రకారం.. రాజధాని మార్పు అంత “వీజీ” కాదు. జీఎన్ రావు కమిటీ నివేదికతో కేబినెట్ నిర్ణయం తీసుకుంటే.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని.. కోర్టులో ప్రభుత్వ నిర్ణయం వీగిపోతుందని తేల్చేశారు. దీంతో బీసీజే రిపోర్ట్ తీసుకుని…రెండింటిపై… చట్టబద్ధంగా.. మంత్రులు, ఐఏఎస్‌లతో కమిటీ వేసి ముందుకు వెళ్లాలనుకున్నట్లుగా తెలిసింది.
అయితే దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదని ఢిల్లీ స్థాయి న్యాయనిపుణులు ఏపీ సర్కార్ పెద్దలకు తమ ఒపీనియన్ పంపారు. 2014 డిసెంబర్ 8వ తేదీన అసెంబ్లీలో అమరావతి తీర్మానం చేయడం… ఆ తీర్మానాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సమర్థించడం.. కోర్టుల్లో ప్రధాన సాక్ష్యంగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ అధినేత మారినంత మాత్రాన తీర్మానం వీగిపోదని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీన్ని అధిగమించాలంటే.. మళ్లీ తీర్మానం చేయాలని.. జగన్ భావిస్తున్నారు. అందుకే.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు తెరపైకి వస్తున్నాయి.
అదే సమయంలో రాజధాని రైతులకు, సీఏఆర్డీకు మధ్య జరిగిన భూ సమీకరణ ఒప్పందంలో రాజధాని ఏర్పాటుకు భూములు తీసుకుంటున్నామని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం, రైతుల మధ్య కుదిరిన ఒప్పందంలో విశాల ప్రయోజనాల అంశం, రాష్ట్ర భవిష్యత్, ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉండటంతో కోర్టులు ప్రభుత్వ రాజధాని మార్పు నిర్ణయాన్ని కొట్టివేసే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు సూచించారు. దీంతో ప్రభుత్వం రైతులతో చర్చలకు సిద్ధమవుతోంది. వారికి కావాల్సిన ఇచ్చి..సంతృప్తి పరిచిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. కానీ అది సాధ్యమా అన్నదే ప్రశ్న.