రాజధానిపై ఇంత రచ్చ జరుగుతున్నా.. జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిండం లేదు. ఓ ట్వీట్ కానీ.. మరో మీడియా ప్రకటన కానీ.. ఆయన దగ్గర్నుంచి రావడం లేదు. రాజధాని విషయంలో పవన్ కల్యాణ్.. మొదటి నుంచి ఎగ్రెసివ్ గా ఉన్నారు. జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత చిరంజీవి…మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేసిన రోజునే.. దానికి భిన్నంగా మరో ప్రకటన చేశారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తానని చెప్పారు. అప్పట్నుంచి పవన్ కల్యాణ్ స్పందించడం లేదు. దీంతో.. రాజకీయవర్గాల్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి.
అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం దేశంలో లేరని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా ఆయన.. క్రిస్మస్ కోసం.. తన సతీమణి అన్నా లెజ్నోవా సొంత దేశానికి వెళ్తారు. ఆమె సొంత దేశం ఏదో ఎవరికీ పెద్దగా తెలియకపోయినప్పటికీ.. యూరప్ అని మాత్రం చెబుతారు. గత ఏడాది ఎన్నికల మూడ్ ఉన్న సమయంలోనే.. ఆయన క్రిస్మస్ ట్రిప్ కోసం.. యూరప్ వెళ్లారు. అక్కడ చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వీడియోలు, ఫోటోలను జనసేన విడుదల చేసింది కూడా. ఈ సారి మాత్రం… పవన్ కల్యాణ్.. విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని కూడా జనసేన వర్గాలు అధికారికంగా చెప్పలేదు.
క్రిస్మస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్..అమరావతి విషయంలో తన కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం.. ఇప్పటికీ.. విశాఖకు రాజధానిని తరలించాలనే ఆలోచన చేస్తోందని… అందరూ నమ్ముతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేలా… ఉద్యమం చేసేందుకు పవన్ సిద్ధమవుతారని అంటున్నారు. తను విదేశీ పర్యటనలో ఉన్నందున… తన సోదరుడు నాగబాబును అమరావతి రైతుల వద్దకు పంపారు. పవన్ వచ్చిన తర్వాత ఆయనే.. అమరావతిలో పర్యటించే అవకాశం ఉందంటున్నారు.