అమరావతిని రాజధానిగా తొలగించి విశాఖను రాజధానిగా మార్చాలనుకున్నారు జగన్. దీనికి అసలు కారణం ఏమిటో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ జగన్ కు స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉందంటున్నారు. అది .. టీడీపీకి మూడు ప్రాంతాల్లో వ్యతిరేకత తీసుకు రావడం. కానీ ఇక్కడ జగన్ నిర్ణయం వల్ల.. అది రివర్స్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అభివృద్ది చెందిన విశాఖ నగరానికి రాజధాని వెళ్లటం పై అక్కడ కూడా ఏకాభిప్రాయం రాలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. పైగా జగన్ అనుచరులు, బంధువులు, వైసిపి నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టిడిపి, మిగతా పక్షాల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో వైసిపి ప్రజా ప్రతినిధులను రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి. ముఖ్యమంత్రి నివాసంలో గుంటూరు, కృష్ణాజిల్లాల ప్రజా ప్రతినిధులు తాము నిరసనలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాయలసీమ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వచ్చాయి. రాజధాని ప్రకటించకపోతే.. రాష్ట్రం కావాలని వారన్నారు. ఉంటే అమరావతిని రాజధానిగా ఉంచాలి.. లేకపోతే.. తమ ప్రాంతంలో పెట్టాలనే డిమాండ్లు అన్ని చోట్లా నుంచి వచ్చాయి. విశాఖ వాసుల్లో… రాజధానిపై సానుకూలత ఉన్నా.. జగన్ తీసుకొచ్చి పెడుతున్నారంటే.. దాని వెనుక ఏదో గూడుపుఠాణి ఉందన్న భయం కూడా ఏర్పడింది.
విశాఖలో రాజధాని పెట్టడం వల్ల.. ఉత్తరాంధ్రలో మరో రెండు జిల్లాలైన.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వచ్చే లాభం ఏమిటో .. ప్రభుత్వం వివరించలేకపోయారు. మీ భూముల విలువ పెరుగుతాయని మాత్రం.. వైసీపీ నేతలు.. ఆయా జిల్లా ప్రజలకు చెప్పుకున్నారు. కానీ.. దాన్ని వారు విశ్వసించలేకపోయారు. రాజధాని పెట్టినందున.. అమరావతి రైతులు కోటీశ్వరులు అయ్యారని.. అలాగే మీరూ అవుతారన్న అభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల్లో పెంచాలని వైసీపీ ప్రయత్నించింది కానీ.. విశాఖ అప్పటికే అభివృద్ధి చెందిన నగరం.. కొత్తగా.. జగన్ చేసేదేముందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఉత్తరాంధ్రలో అనుకున్నంత సానుకూలత రాకపోగా.. ఇతర ప్రాంతాలు వ్యతిరేకం అవడంతో.. జగన్ కు తాను తీసుకున్న నిర్ణయం రివర్స్ అయినట్లయిందని అంటున్నారు.