విశాఖను రాజధానిగా తాము చేద్దమనుకుంటే.. టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు..! .. ఇదే సింగిల్ పాయింట్ ఎజెండాగా.. వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. శుక్రవారం కేబినెట్ భేటీలో .. రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోలేకపోయిన.. జగన్.. కొన్ని కమిటీలు వేసి..న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకుని.. విశాఖను రాజధానిగా ప్రకటించాలనుకుటున్నట్లుగా తెలుస్తోంది. ఈ లోపు.. విశాఖలో రాజధాని అని డిక్లేర్ చేసి.. బోర్డు పెట్టేందుకు రెడీ అయిపోయిన విజయసాయిరెడ్డి.. కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. తాము విశాఖకు రాజధానిని తీసుకు వస్తూంటే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని.. చెబుతున్నారు. రాజధానిలో .. ఫండింగ్ ఉద్యమాలు నడుపుతున్నారని.. ఆరోపణలు ప్రారంభించారు.
ఇక ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం.. తాను రాజకీయం మాట్లాడటం లేదని.. రాజధాని గురించి మాట్లాడుతున్నానని లీడ్ తీసుకుంటున్నారు. విశాఖలో రాజధానిని వ్యతిరేకించేవాళ్లంతా.. ఉత్తరాంధ్రను వ్యతిరేకించేవాళ్లేనని ప్రకటించేశారు. టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకులా.. అనుకూలురా చెప్పాలని కూడా సవాల్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి.. ఇలా మాట్లాడకూడదని..చాలా మంది సూచనలు ఇచ్చినప్పటికీ.. తాను ముందు ఎమ్మెల్యేనని తమ్మినేని కవర్ చేసుకుంటున్నారు. సచివాలయాన్ని విశాఖకు రాకుండా చేస్తూ.. టీడీపీ నేతలు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టేశారు.
తమ్మినేని తర్వాత ఆ బాధ్యతను.. అవంతి శ్రీనివాస్ తీసుకుంటున్నారు. అవంతి మరింత ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థను కూడా.. కలిపేస్తున్నారు. న్యాయవ్యవస్థను అడ్డు పెట్టుకుని విశాఖకు రాజధానిని రాకుండా.. చంద్రబాబు అడ్డు పడుతున్నారంటూ.. ఆరోపణలు చేసేశారు. అన్యాయం జరిగితే.. సామాన్యులకైనా.. పెద్దలకైనా.. కోర్టులు తప్ప..మరో ఆప్షన్ లేదు. కోర్టులకు వెళ్లడం కూడా తప్పేనన్నట్లుగా.. అవంతి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయరని.. ఇలా ప్రకటనలు చేసి.. చివరికి ఏమీ చేయకుండా.. ఇతరులు అడ్డుకున్నారని ప్రచారం చేస్తారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చివరికి అలాంటి వ్యూహమే అమలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోందని.. టీడీపీ నేతలు అంటున్నారు.