తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు బుల్లెట్ ట్రైన్ .. మంజూరు చేయించండి..! ఈ విన్నపం .. రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. స్వయంగా ఓ ప్రముఖ నేత తీసుకెళ్లారు. అయితే.. ఆ ప్రముఖ నేత.. విజయవాడ రాజధాని కోసం పోరాడుతున్న వారో.. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత ఉన్న టీఆర్ఎస్ నేతలో చేయలేదు.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. ఆయన శీతాకాలం విడిదికి..హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను.. బొల్లారంలోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు.
తన బుల్లెట్ ట్రైన్ విజ్ఞప్తిని కేంద్రానికి ప్రత్యేకంగా విన్న వించాలని కూడా కోరారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య.. బుల్లెట్ రైలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజా రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని ఉత్తమ్ చెప్పారు. పూర్తి వివరాలతో ఢిల్లీలో తనను కలవాలని రామ్‌నాథ్ కోవింద్.. ఉత్తమ్‌కు సలహా ఇచ్చారట. అందుకే త్వరలో పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌కు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆయన పార్టీ వ్యవహారాలను ఆయన చక్కబెట్టలేకపోతున్నారు.
కానీ హఠాత్తుగా.. ఆయన ఏపీ రాజధాని విజయవాడే అని ప్రత్యేకంగా గుర్తు చేసేలా.. హైదరాబాద్ టు విజయవాడ బుల్లెట్ ట్రైన్ కావాలని.. రాష్ట్రపతిని కలవడం ఏమిటో.. చాలా మందికి అంతు చిక్కకుండా ఉంది. దీని వెనుక కచ్చితమైన కారణం ఏదో ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తమ్ ప్రస్తుతానికి దత్త తీసుకున్న హైదరాబాద్ – అమరావతి బుల్లెట్ ట్రైన్ కథేంటో.. కొన్ని రోజులాగితే కానీ క్లారిటీ రాదు.