శ్రీవారి ఆలయంలో తవ్వకాలు .. పింక్ డైమండ్ మాయం.. శ్రీవారి హుండీల్లో డబ్బులు వేయవద్దు అంటూ.. ప్రచారం చేసిన.. రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీలోని వ్యవహారాలను బయట పెడుతున్న మీడియాపై మాత్రం..తనదైన యాక్షన్ ప్రదర్శిస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రికపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయాలని.. పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. ఫలానా కథనం రాసి.. ప్రతిష్ట తీశారనే విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా.. పిటిషన్ మాత్రం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్నాళ్ల క్రితం..లడ్డూ ధరలు పెంచాలని.. టీటీడీ ప్రయత్నించింది. ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి బయట పెట్టింది. అలాగే.. పలు అంశాలపై.. టీటీడీ చర్యలను ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తూ వస్తోంది. దీంతో పలు రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. అన్యమత విషయంలోనూ.. టీటీడీకి చిక్కులు ఏర్పడ్డాయి. దీన్నే తమ ప్రతిష్టమకు భంగంగా భావించిన టీటీడీ పెద్దలు… ఆ ప్రతిష్టను శ్రీవారికి ఆపాదించేసి.. కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై.. ఇలా వంద కోట్లకు టీటీడీ పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేసింది.
వారు టీటీడీపై చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. నేరుగా.. శ్రీవారి ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా ఆరోపణలు చేశారు. కానీ వారిపై వేసిన పిటిషన్లను.. టీటీడీ కొద్ది రోజుల కిందట ఉపసంహరించుకుంది. వారు చేసిన ఆరోపణలు.. దిగజార్చిన ప్రతిష్టపై.. కనీసం వారి దగ్గర క్షమాపణ పత్రం కూడా టీటీడీ అడగలేదు. కానీ ఇప్పుడు మీడియాపై… గురి పెట్టి… వివాదాస్పద నిర్ణయాలను మీడియాలో రాకుండా చేయాలనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి